Nandyal Raviteja Bags Two International Records in Collecting Coins : నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలోని వెండి నాణేలను మీరు ఎప్పుడైనా చూశారా? లేదంటే 3 వందల ఏళ్ల నాటి టిప్పుసుల్తాన్ కాలంలో వాడుకలో ఉన్న నాణేలను చూశారా? 1862లో విక్టోరియా మహారాణి విడుదల చేసిన క్వార్టర్ అణా గురించి తెలుసా? జింబాబ్వే దేశంలోని 10 మిలియన్ డాలర్స్ నోట్‌ను చూశారా? అయితే తదితర దేశాల కరెన్సీని, వాటి చరిత్రను తెసుకోవాలంటే ఈ యువకుడు నిర్వహించే కార్యక్రమాన్ని సందర్శించాల్సిందే.
రవితేజ బొంతల స్వస్థలం నంద్యాల. తల్లిదండ్రులు ఆదినారాయణ, లక్ష్మి నారాయణమ్మ. చదువుల్లో రాణించి బీటెక్ పూర్తి చేశాడు. ప్రతిభతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే చిన్నప్పుడు తండ్రిని చూసి స్ఫూర్తి పొంది నాణేలు, కరెన్సీ నోట్లు సేకరించడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. కుమారుడి ఆసక్తిని గమనించిన తండ్రి మరింతగా ప్రోత్సహించాడు.
ఏడో తరగతి నుంచే తన అభిరుచికి తగ్గట్లుగా కరెన్సీని సేకరించటం ప్రారంభించాడు రవితేజ. చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తన అభిరుచిని కొనసాగించాడు. దాని ప్రతిఫలంగానే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూనే సెలవు దినాల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు పాఠశాలల్లో కరెన్సీ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. గతంలో మన పూర్వీకులు వినియోగించిన నాణేలు, ఇతర దేశాల్లో వాడకంలో ఉన్న కరెన్సీ గురించి, ఆయా దేశాల చరిత్ర, సంస్కృతి, నాగరికతల గురించి విద్యార్థులకు తెలియజేస్తున్నారు.
" చిన్నప్పటీ నుంచి కాయిన్స్ సేకరించడం నాకు హాబీగా ఉంది. మా నాన్న, బంధువుల నుంచి కూడా సేకరించే వాడిణ్ని. అప్పుడప్పుడు మా నాన్న కూడా కాయిన్స్ కలెక్ట్ చేసి నాకు ఇచ్చేవారు. భారతదేశ వారసత్వ సంపద నుంచి తెలుసుకోవడానికి కాయిన్స్ మంచి ఉదాహరణ. గత కొంత కాలంగా కాయిన్స్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నాను "-రవితేజ బొంతల, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
తరగతి గదుల్లో కూర్చోబెట్టి పాఠాలు బోధించకుండా ఈ విధంగా కాయిన్స్, నోట్ల ద్వారా చరిత్రను చెబితే విద్యార్థులకు తేలిగ్గా అర్థం చేసుకుంటారని అంటున్నాడు రవితేజ. నేటి తరం చిన్నారులు పాఠశాలల్లో పుస్తకాలతో కుస్తీ పడుతూ తీరిక వేళల్లో సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. రీల్స్, షార్ట్స్ చూస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చదువుతోపాటు ఏదో ఒక అభిరుచిని కలిగి ఉండాలని చెబుతున్నారు..
మన దేశానికి చెందిన 1600 కాయిన్స్ సేకరించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్నాడు రవితేజ. మెుత్తంగా దేశ విదేశాలకు చెందిన 2435 కరెన్సీ నోట్లు, కాయిన్స్‌ను సేకరించి ఇదే ఏడాది మే 11 న వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కైవసం చేసుకున్నాడు. ఇలా సేకరించడమే కాకుండా వాటి చరిత్రలను వివరిస్తూ వినూత్నంగా నిలుస్తున్నాడు. త్వరలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సైతం వచ్చే అవకాశం ఉన్నట్లు రవితేజ చెబుతున్నాడు.