Nagarjuna approached court over Konda Surekhas comments : మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేశారు. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమను రాజకీయాల్లోకి లాక్కొచ్చారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించడం, వారి వ్యక్తిగత విషయాలను మీడియా ముఖంగా మాట్లాడడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే అటు అక్కినేని కుటుంబం, ఇటు సమంత ఖండించారు.
సీనీతారల ఆగ్రహం : తాజాగా మంత్రి వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని నటీనటులు స్పందిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలపై ఇప్పటికే కొందరు నటులు స్పందించగా తాజాగా మహేశ్‌బాబు, రవితేజ, మంచు మనోజ్, సంయుక్త మేనన్, తేజ సజ్జా, విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని ఎన్టీఆర్ మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు.
కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మరో నటుడు నాని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలన్నారు. ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఈ ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు తీవ్రంగా కలచివేశాయని నటుడు మహేష్ బాబు మండిపడ్డారు. నిరాధారమైన ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాని మన దేశంలో ఉన్న మహిళలతోపాటు సినీ ప్రముఖులను గౌరవమర్యాదలతో చూడాలని ట్వీట్ చేశారు.
నటి సమంతకు క్షమాపణలు : మరోవైపు మంత్రి కొండా సురేఖ సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. అన్యధా భావించవద్దని కొండా సురేఖ పేర్కొన్నారు.