Minister Narayana Interview 2024 : ఏపీలోనూ చెరువులు, వరద కాలువల్లో ఆక్రమణల తొలగింపునకు తెలంగాణలోని హైడ్రా తరహాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో జల వనరులను ఆక్రమించి భారీగా చేపట్టిన నిర్మాణాలతో వరద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తుతోందని చెప్పారు. ఆక్రమ నిర్మాణాల తొలగింపుతోనే భవిష్యత్లో విజయవాడ తరహా విపత్తులు ఏపీలో పునరావృతం కావని నారాయణ స్పష్టం చేశారు.
ఈ తరహా ఆక్రమణల విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని నారాయణ వ్యాఖ్యానించారు. పేదలకు చెందిన నిర్మాణాల విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే తొలగిస్తామని పేర్కొన్నారు. బుడమేరు వరదలు మానవ తప్పిదం కాదని గత సర్కార్ నిర్లక్ష్యమే కారణమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. విజయవాడలో వరదలపై ప్రభుత్వం తీసుకున్న సహాయ చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై ‘ఈనాడు- ఈటీవీ భారత్’ ఇంటర్వ్యూలో మంత్రి నారాయణ పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.
కొందరి స్వార్థంతోనే తీవ్ర నష్టం : కొందరు స్వార్థంతో నీటి వనరులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కారణంగా లక్షలాది మంది ప్రజలు వరదలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని ఉపేక్షించేది లేదు. విజయవాడలో ముంపు సమస్య తలెత్తకుండా టీడీపీ సర్కార్ హయాంలో ప్రారంభించిన వరదనీటి ప్రవాహ ప్రాజెక్టు పనులను ఆ తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అక్రమ నిర్మాణాలకు లైసెన్సులిచ్చి మరి ప్రోత్సహించింది. ఇకపై ఆక్రమణలకు సంబంధించి పట్టణ ప్రణాళిక అధికారుల్ని బాధ్యులను చేయబోతున్నాం. పట్టణ ప్రణాళిక విభాగంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా అధ్యయనం కోసం అధికారులను 15 రాష్ట్రాలకు పంపాం. వారి నుంచి నివేదిక వచ్చాక కొత్త నిర్మాణాలకు అనుమతులపై మరింత సమర్థ విధానాన్ని అమలు చేయనున్నాం.
విజయవాడలో 3 రోడ్లకు 40 గండ్లు కొట్టాల్సి వచ్చింది : బుడమేరు ఉధృతితో విజయవాడలో మూడు రోడ్లకు దాదాపు 40 చోట్ల గండ్లు కొట్టి, ముంపు నీటిని పంపింగ్ చేసి బయటకు పంపాం. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో 6 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 12 లక్షల మందికి ఆహారం అందించాం. ప్రభుత్వం బియ్యం, ఇతర నిత్యావసరాలు సరఫరా చేశాక, ఆహార పంపిణీని నిలిపి వేయాలని ప్రజలే చెప్పటంతో ఆపాం. కానీ పేదల నుంచి మళ్లీ విజ్ఞప్తులు రావటంతో పునఃప్రారంభించాలని నిర్ణయించాం.
మాపై కోపంతో బుడమేరు కాలువ పనుల్ని విస్మరించారు : బుడమేరు వరద కాలువ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలించింది. కానీ ఆ తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ సర్కార్ మాపై కోపంతో వాటిని విస్మరించింది. అదే విజయవాడకు శాపమైంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆ పనులను ఎన్డీయే కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది. గుంటూరులో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనుల పూర్తికి, నెల్లూరులో ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నాం.
టీడీఆర్ బాండ్ల కుంభకోణం వెనుక ఎవరున్నా చర్యలు తప్పవు : టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై అధికారుల కమిటీ, ఏసీబీ ఇచ్చే నివేదికలపై తదుపరి చర్యలు తీసుకుంటున్నాం. ఈ కుంభకోణంలో గత సర్కార్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భాగస్వామ్యంపై విచారిస్తాం. వీటిపై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం. ఇకపై ఈ తరహా అవకతవకలు పునరావృతం కాకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తీసుకొస్తున్నాం.
రాజధానిపై వైకాపా దుష్ప్రచారాన్ని ప్రజలు గుర్తించారు : అమరావతిలోకి వరద నీరు చేరి, మునిగిపోయిందన్న వైఎస్సార్సీపీ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలే నిర్ధారించారు. కృష్ణా నదికి కొన్ని లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా రాజధానికి ఎలాంటి ఇబ్బందీ లేదని ఇప్పుడు తేలిపోయింది. వరదలకు అమరావతి మునిగిపోతుందని, రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేయొద్దని వైఎస్సార్సీపీ అధినేత జగన్ గతంలోనే ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేశారు. రాజధానిపై ఆ పార్టీ నేతల తీరు దారుణం.
విజయవాడలో బుడమేరు కాలువతోపాటు ఆంధ్రప్రదేశ్లోని మిగతా ప్రాంతాల్లోనూ నీటి వనరుల ఆక్రమణలపై సర్వే ప్రారంభమవుతుంది. ఇందుకోసం అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నాం. వరదనీటి కాలువల వెడల్పు ఎంత? అవి ఎంతవరకు ఆక్రమణలకు గురయ్యాయి? ఆక్రమిత ప్రాంతంలో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి? వాటిలో పేదలవి ఎన్ని? పెద్దలకు చెందినవి ఎన్నో గుర్తిస్తాం. సమగ్ర నివేదిక రూపొందించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటాం.