Kadambari Jethwani Case Updates : తప్పుడు కేసు నమోదు చేసి తనను భయపెట్టారని ముంబయి నటి కాదంబరీ జెత్వానీ జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చారు. స్టేట్మెంట్లో తనపై కేసు నమోదు, విచారణ చేసిన పోలీసు అధికారుల పేర్లను సహా వెల్లడించారు. ఈ కుట్రకు నాటి సీఎం కార్యాలయంలోనే బీజం పడిందని ఆమె తెలిపారు. అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీని నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులును సీఎంఓ కార్యాలయానికి జనవరి 31న పిలిపించారని వివరించారు.
వైఎస్సార్సీపీకి చెందిన నేత కుక్కల విద్యాసాగర్ పోలీసు ఉన్నతాధికారులతో కుమ్మక్కై ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని కాదంబరీ జెత్వానీ వివరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే ముంబయికి విమాన టిక్కెట్లు బుక్ చేసుకుని విశాల్‌గున్నీ బృందం వెళ్లిందని వాంగ్మూలం ఇచ్చారు. విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్డి కోర్టులో ఆమె స్టేట్‌మెంట్‌ను న్యాయాధికారి రికార్డు చేసుకున్నారు. ఆమెతో పాటు మరోసాక్షి అయిన గొరిపర్తి శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.
Mumbai Actress Harassment Case : పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకునే ఎత్తుగడలో భాగంగానే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని కాదంబరీ జెత్వానీ పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాలపై ముంబయి వచ్చి తనతోపాటు తల్లిదండ్రులనూ అరెస్టు చేయడం కుట్రలో భాగమేనన్నారు. పోలీసు కస్టడీలో ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు మగ పోలీసు అధికారులే సుదీర్ఘంగా విచారించారని చెప్పారు. ఏసీపీ హనుమంతరావు, ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ తనను విచారించినట్లు తెలిపారు. ముంబయి కేసును వెనక్కి తీసుకోమని వారు బెదిరించారని కాదంబరీ జెత్వానీ వెల్లడించారు.
వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ ఒప్పంద పత్రాన్ని సృష్టించి కట్టుకథ అల్లారని కాదంబరీ జెత్వానీ వెల్లడించారు. 2015లో కుక్కల విద్యాసాగర్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించానన్న అక్కసుతో కుట్రకు పాల్పడ్డారన్నారు. ముంబయిలో తన తల్లిదండ్రులను అరెస్టు చేసిన సమయంలో అప్పటి కేసు విచారణ అధికారి సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు శ్రీధర్, శ్రీను, అడిషనల్ డీసీపీ రమణమూర్తి, ఎస్ఐ షరీఫ్, దుర్గ తదితరులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని వాంగ్మూలం ఇచ్చారు.
పరువు, ప్రతిష్టకు భంగం కలిగింది : జనవరి 31 నుంచి ఫోన్ ట్రాకింగ్‌లో పెట్టి కదలికలను తెలుకుంటున్నారని కాదంబరీ జెత్వానీ వివరించారు. తన తాత్కాలిక డ్రైవర్‌ను బంధువుగా చూపించి అతనికి అరెస్టు సమాచారం చేరవేసినట్లు రిమాండ్ రిపోర్టులో చూపించారని పేర్కొన్నారు. పోలీసులు బోగస్ పత్రం, తప్పుడు సాక్షులను పెట్టి నమోదు చేసిన కేసు వల్ల తన పరువు, ప్రతిష్టకు భంగం కలిగిందని ఆమె న్యాయాధికారికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.