MSME Sector Providing Jobs : భాగ్యనగరం అనగానే ఐటీ, ఫార్మా రంగాలే గుర్తుకొస్తాయి. ఈ రెండింటికీ మించిన ఉపాధి కల్పిస్తున్న మరో రంగం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు). రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఎస్‌ఎంఈల్లో 40 శాతం రాజధాని పరిధిలోని 3 జిల్లాల్లోనే ఉన్నాయి. గుండుసూది నుంచి రాకెట్లు, క్షిపణుల్లో ఉపయోగించే విడిభాగాల వరకు నగరంలోనే ఉత్పత్తి అవుతాయి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) చేపట్టే ప్రయోగాల్లో ఉపయోగించే పరికరాలను రూపొందించే సంస్థలే 2వేల దాకా ఉంటాయి.
కేంద్రం తీసుకొచ్చిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్‌లో తెలంగాణ నుంచి 8.93 లక్షల ఎంఎస్‌ఎంఈలు నమోదయ్యాయి. అందులో హైదరాబాద్ నగరంలోని మూడు జిల్లాల్లోనే 3.58 లక్షల వరకు ఉన్నాయి. సేవల రంగం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, వస్త్ర, ఆటో కంపోనెంట్స్, ఆరోగ్య, జీవశాస్త్రాలు, ప్లాస్టిక్, పాలిమర్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ హార్డ్‌వేర్, ఆభరణాల వరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో తయారు చేస్తుండటంతో లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది.
మహిళలే ఔత్సాహికవేత్తలుగా : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో మహిళా ఔత్సాహికవేత్తలు పెరుగుతున్నారు. రాష్ట్రంలో ప్రతి 1000 మంది మహిళల్లో ఒకరు ఎంఎస్‌ఎంఈ సంస్థను నడుపుతున్నారు. 58,644 మంది మహిళా ఔత్సాహికవేత్తలు వేర్వేరు రంగాల్లో సంస్థలను ఏర్పాటు చేసి రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. మహిళల పేరుతోనే పారిశ్రామిక వాడలు కూడా ఉన్నాయి. వీరి భాగస్వామ్యం మరింత పెంచే దిశగా ప్రభుత్వం చొరవ చూపుతోంది.
గృహిణులకు నైపుణ్య శిక్షణతో : ఎంఎస్‌ఎంఈ రంగంలో చాలా మార్పులొస్తున్నాయి. అందుకు తగ్గ నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకు ముందు పనిలో చేరాక నైపుణ్యాలు నేర్చుకున్న వారే అధికం. ఆటోమేషన్, రోబోటిక్స్ లాంటి సాంకేతికతల నేపథ్యంలో అందుకు తగ్గ నైపుణ్యాలు అవసరం అంటున్నాయి పరిశ్రమల వర్గాలు.
కొత్తగా తెచ్చిన పాలసీతో నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సర్కారు చెబుతోంది. పట్టణాల్లో మిగతా వర్గాలతో పోలిస్తే మహిళలకు ఎంఎస్‌ఎంఈలు అనుకున్న స్థాయిలో పనిని కల్పించలేకపోయాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వర్గం లక్ష్యంగా నైపుణ్యాలు నేర్పిస్తే ఎంఎస్‌ఎంఈ రంగం మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.