MP Purandeswari at Rajahmundry Airport : రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ కూలిన ప్రాంతాన్ని ఎంపీ పురందేశ్వరి పరిశీలించారు. 15 ఇనుప రాఫ్టర్లు ఎలా కూలిపోయాయని విమానాశ్రయ అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఇంత నిర్లక్ష్యంగా పనులు ఎలా చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనలో కూలీలు చనిపోయి ఉంటే ఏం చేసేవారని? ప్రశ్నించారు. ఈ ప్రమాదంపై చెన్నై ఐఐటి నిపుణ బృందంతో విచారణ చేపట్టనున్నట్టు చెప్పారు. నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంపీ స్పష్టం చేశారు.
నివేదిక కోరిన కేంద్రమంత్రి : రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ ఉక్కు గడ్డర్లు నిన్న(శుక్రవారం) కూలిపోయాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న టెర్మినల్ భవనాన్ని అనుకుని సుమారు 350 కోట్ల రూపాయలతో నూతన టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. క్రేన్ సాయంతో పనులు చేస్తున్న సమయంలో టెర్మినల్లో కొంత భాగం కుప్ప కూలింది. ప్రమాద సమయంలో ఇద్దరు కార్మికులకు గాయాలైనట్లు సమాచారం. గత నెలలో రాజమండ్రి విమానాశ్రయం నుంచి దిల్లీకి ఎయిర్ బస్సు సర్వీసును ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న టెర్మినల్ ఉక్కు గడ్డర్లు కుప్పకూలడంపై ఎయిర్ పోర్ట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రమాదంపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఆరా తీశారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ, పౌరవిమానయాన అధికారులతో మాట్లాడారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
టెర్మినల్ భవనం నిర్మాణంతో పాటు ముఖద్వారం తదితర చోట్ల పశ్చిమ బెంగాల్, బిహార్, చెన్నై, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 250 మంది కార్మికులు పని చేస్తున్నారని తెలుస్తోంది. అయితే వీరంతా వేర్వేరు సమయాల్లో విధులు నిర్వహిస్తుంటారు. ఇంత మొత్తంలో కార్మికులు పని చేస్తుండటం, అవసరమైన రక్షణ చర్యలు, తాత్కాలిక వైద్య సౌకర్యాలు వంటి ఏర్పాట్లు కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్త టెర్మినల్ నిర్మాణం : బ్రిటీషు కాలంలో ప్రారంభమైన రాజమహేంద్రవరం విమానాశ్రయం అంచెలంచెలుగా పలు రకాలుగా అభివృద్ధి పనులతో రూపు రేఖలు మార్చుకుంటూ వస్తుంది. గతంలో బ్రిటీషు కాలంలో నిర్మించిన నాటి టెర్మినల్ భవనం ఉండేది. ఇదే స్థానంలో పక్కనే ప్రస్తుతం విస్తరణ పనులు చేస్తున్నారు. శుక్రవారం నాటి ఘటనతో అధికారులు మున్ముందు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం కనిపిస్తోంది. నేడు ఉన్నతస్థాయి సాంకేతిక బృందం ఘటనాస్థలిని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.
భోగాపురం ఎయిర్‌పోర్టుకు మరో 500 ఎకరాలు - మంత్రుల కమిటీ ఏర్పాటు
ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీ సర్వే పూర్తి - మారనున్న ఆ ఏడు ప్రాంతాల రూపురేఖలు