Cinema Shootings in Dandumalkapur : చుట్టూ ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటంతో సినిమాల చిత్రీకరణలకు కేరాఫ్‌గా మారింది దండుమల్కాపురం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఈ గ్రామం శివారులో పలువురు అగ్ర హీరోల సినిమాలను చిత్రీకరించారు. ఎక్కువగా ఇక్కడ అగ్ర హీరోల సినిమాల్లోని క్లైమాక్స్ ఫైటింగ్ సన్నివేశాలనే చిత్రీకరించారు.
ప్రస్తుతం హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా చిత్రీకరణ కూడా దండుమల్కాపురంలో జరుగుతుంది. నెల రోజుల క్రితమే ఇక్కడ వేసిన రాజస్థాన్ పల్లెటూరు సెట్టింగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే హీరో బాలకృష్ణ, హీరోయిన్ పై పలు కీలక సన్నివేశాలను దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) తెరకెక్కించారు. మరికొన్ని రోజుల పాటు ఇక్కడ సినిమా చిత్రీకరణ జరగనున్నట్టు షూటింగ్ సిబ్బంది తెలిపారు.
గబ్బర్ సింగ్ సినిమాతో మొదలు : దండుమల్కాపురంలో మొదట పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా క్లైమాక్స్ ఫైటింగ్‌ను చిత్రీకరించారు. దర్శకుడు హరీశ్ శంకర్ స్కార్పియో వాహనాలతో తీసిన ఛేజింగ్, ఫైటింగ్ సీన్ సినిమాలో హైలెట్‌గా నిలిచింది. ఇదే సినిమాలో ఓ పాటలో సన్నివేశం కూడా ఉంది. డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ నటించిన రెబల్ సినిమా చిత్రీకరణ కూడా ఇక్కడే జరిగింది. హెలీకాప్టర్‌లో ప్రభాస్ ఎంట్రీ, హీరో, విలన్ మధ్య ఫైటింగ్ చేసే సన్నివేశాలను ఇక్కడే తీశారు.
శ్రీనువైట్ల దర్శకత్వంలో హీరో మహేశ్‌బాబు నటించిన ఆగడు సినిమా కూడా జరిగింది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ కూడా ఇక్కడే చిత్రీకరించారు. సినిమాలో విలన్ జగపతిబాబు వ్యాపారంలో భాగంగా నిర్మించే గ్యాస్ ప్లాంట్ సెట్టింగ్‌ను ఇక్కడే వేశారు. హీరో, విలన్, హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌పై పలు సన్నివేశాలను తీశారు. సినిమాలో వచ్చే ఫైటింగ్‌లలో, పాటలో కూడా పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ సినిమా షూటింగ్‌లు జరిగిన ప్రాంతాలు ఇప్పుడు పారిశ్రామిక పార్కులో కలిసిపోయాయి. ఇప్పుడు పారిశ్రామిక పార్కు ఎదురుగానే బాలకృష్ణ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో హీరోలు అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, హీరోయిన్ అనుష్క నటించిన రుద్రమదేవి సినిమా, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో హీరో చిరంజీవి నటించిన 151వ సినిమా సైరా నరసింహారెడ్డి సినిమాలు దండుమల్కాపురం రెవెన్యూ పరిధిలోని మైలారం రోడ్డులోని గుట్టల్లోనే చిత్రీకరించారు. ఈ సినిమాల కోసం భారీ సెట్టింగ్‌లను వేశారు.