Toll Fees Burden for Motorists : విజయవాడ-గుంటూరు నేషనల్ హైవేపై ఉన్న కాజా వద్ద ఉన్న టోల్‌ప్లాజాలో వాహనదారులు ఒకరోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే, అన్నిసార్లూ టోల్ మోత మోగుతోంది. ఏపీలోని 65 టోల్‌ప్లాజాల్లో ఇదే పరిస్థితి. వీటి బీవోటీ గడువు ముగియడంతో అక్టోబర్ నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ వరకు ఒకసారి వెళ్తే కారుకు రూ.160 చెల్లించేవారు. తిరుగు ప్రయాణంలో రూ.80 చెల్లిస్తే సరిపోయేది. ఇలా 24 గంటల వ్యవధిలో మళ్లీ ఎన్నిసార్లు తిరిగినా టోల్ వసూళ్లు ఉండేవి కావు.
కానీ అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ ఒకవైపు పూర్తి ఫీజు, రెండోసారి సగం ఫీజు చొప్పున వసూలు చేస్తున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య నిత్యం వందలమంది వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వారిపై టోల్ రూపంలో తీవ్ర భారం పడుతోంది.
నాలుగింట మాత్రమే పాత విధానం :
- ఏపీలోని అన్ని జాతీయ రహదారుల్లో కలిపి 69 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వాటిలో 65 టోల్‌ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమలవుతున్నాయి.
- నెల్లూరు-చెన్నై హైవేలో ఉన్న వెంకటాచలం, సూళ్లూరుపేట, బూదరం, విజయవాడ-హైదరాబాద్ మార్గంలోని కీసర టోల్‌ప్లాజా కలిపి మొత్తం నాలుగు చోట్ల మాత్రమే పాత నిబంధనలు అమలవుతున్నాయి.
- ఈ 4 ప్లాజాల్లో 24 గంటల్లోపు ఎన్నిసార్లు రాకపోకలు సాగించినా ఒకసారి పూర్తిఫీజు, రెండోసారి సగం ఫీజు మాత్రమే తీసుకుంటారు. వీటి గుత్తేదారుల బీవోటీ గడువు 2031 వరకు ఉంది. అప్పటివరకు ఇదే విధానం కొనసాగనుంది.
- మిగిలిన 65 టోల్‌ప్లాజాల్లో 24 గంటల్లో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ చెల్లించక తప్పడం లేదు.