Parivahan Sewa Problems : వాహనం కొనాలన్నా, దాన్ని నడపాలన్నా రవాణా సేవలు పొందాల్సిందే. ఇటువంటి సేవల్లో 2 సంవత్సరాల నుంచి తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం రవాణాశాఖ ద్వారా జరుగుతున్న సేవలకు సంబంధించి ఉపయోగిస్తున్న పరివాహన్ ఇందుకు కారణంగా ఉంది. నూతన విధానంలో సాఫ్ట్‌వేర్‌ను పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ చేయకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పరివాహన్ సేవలను రెండేళ్ల క్రితం ప్రారంభించింది. వీటిని ప్రారంభించకముందు ఆయా రాష్ట్రాల రవాణా శాఖలు ఏర్పాటు చేసిన అన్ని రకాల ఆన్‌లైన్ సేవలు త్వరితగతిన జరుగుతుండేవి. కేంద్రం అన్ని రాష్ట్రాలలో ఒకే విధమైన రవాణా సేవలు ఉండాలన్న సదుద్దేశంతో పరివాహన్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల సేవలు కఠినతరం అయ్యాయని వాహనదారులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్‌వేర్ పూర్తి స్థాయిలో రూపొందించకముందే ఉపయోగంలోకి తీసుకువచ్చారని తెలిపారు.
ముఖ్యంగా ఎఫ్‌సీల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటి కోసం వచ్చే వారు రోజుల తరబడి రవాణా కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒక వాహనాన్ని వేరొకరు కొనుగోలు చేసినప్పుడు ఆ వ్యక్తి వివరాలు పరివాహన్‌లో కనిపించడం లేేదు. అలాగే పన్నుల వివరాలు అప్‌డేట్ రావడంలేదు. ఈ కారణంగా వాహనాల తనిఖీ సమయంలో వివరాలు కనిపించక అధికారులు జరిమానా విధిస్తున్నారు. జరిమానా చెల్లించాల్సిన బాధ్యుడు దగ్గరలోని రవాణా కార్యాలయానికి వెళ్లి వివరాలు కోరితే సర్వర్ పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడం లేదు.
2,3 రాష్ట్రాలకు కలిపి ఒక కేంద్ర సర్వర్ : డ్రైవింగ్ లైసెన్సుల మంజూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర స్థాయిలో సర్వర్ ఉంటే సమస్య వెంటనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పరివాహన్ కేంద్ర స్థాయిలో ఉండడంతో 2,3 రాష్ట్రాలకు కలిపి ఒక కేంద్ర సర్వర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం అంతంత మాత్రంగానే ఉండి సమస్య తలెత్తుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరివాహన్ ద్వారా వస్తున్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.
త్వరలో పరిష్కారం లభిస్తుంది : పరివాహన్ సాఫ్ట్‌వేర్ ద్వారా సమస్యలు వస్తున్నమాట వాస్తవమేనని నెల్లూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ బి.చందర్ అన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆయా రాష్ట్రాల వారి వివరాలను పూర్తి స్థాయిలో డేటా మైగ్రేషన్ చేయకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని, ఒక రాష్ట్రానికి చెందిన వాహనం ఇతర రాష్ట్రాలలో రాకపోకలు సాగించే సమయంలో వాహనదారులు పన్నులకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, త్వరలో పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు.