Monkey Pox Wards in Gandhi and Fever Hospitals : ప్రపంచ వ్యాప్తంగా ఎంపాక్స్ (మంకీపాక్స్) అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రులను సిద్ధం చేసింది. అక్కడ ఎంపాక్స్ సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది.
గాంధీలో ఈ వ్యాధికి చికిత్స అందించడానికి ప్రస్తుతం 14పడకలతో 2వార్డులు ఏర్పాటు చేశారు. ఇందులో పురుషులకు, మహిళలకు పదేసి పడకలు కేటాయించినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ రాజ్ కుమారి తెలిపారు. ఫీవర్ ఆస్పత్రిలో ఆరు పడకలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలాంటి కేసులు నమోదు కాకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
- ఎంపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాధి కాంగో, నైజీరియా, కామెరూన్ దేశాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు. ఆయా దేశాల నుంచి స్వరాష్ట్రానికి వచ్చే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
- అనుమానం వచ్చినవారు ఐసోలేషన్‌లో ఉండటం, లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రిలో చేరాలని తెలిపారు.
- ఈ వ్యాధి రక్తం, శరీర ద్రవాలు, చర్మ గాయాలు, శ్వాసకోశ స్రావాల ద్వారా ఇతరులకు సోకుతుంది.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించండి
- హఠాత్తుగా జ్వరం రావడం
- తలనొప్పి
- కండరాల నొప్పులు
- వెన్నునొప్పి
- కాళ్లు, చేతులు, ముఖంపై దద్దుర్లు, దురద
- చలి, తీవ్ర అలసట
దిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు
- అత్యవసర విభాగాల్లో ఎంపాక్స్ కేసుల పరీక్షల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి.
- జ్వరం, దద్దుర్లు వచ్చిన వారికి, ఎంపాక్స్ నిర్ధరిత బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలి
- జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, తీవ్ర చలి, అలసట, చర్మంపై పొక్కులు వంటి లక్షణాలతో వ్యాధి నిర్ధరణ చేయాలి.
- అనుమానిత కేసులను తక్షణమే ఐసోలేషన్‌లో ఉంచాలి. తద్వారా ఇతరులకు సోకకుండా నివారించవచ్చు.
- ఎంపాక్స్ అనుమానిత వ్యక్తులను వ్యాధి నిర్ధరణ, చికిత్స కోసం దిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆసుపత్రికి తరలించాలి.
- రోగులను తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేయాలి.
- ఎంపాక్స్ అనుమానిత కేసుల విషయంలో ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించాలి.
టీకాలు ఉన్నాయా?
ప్రస్తుతం మంకీపాక్స్ నివారణకు 2 రకాల టీకాలు ఉన్నాయి. వీటిని గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేసింది.
మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉండాల్సిందే - కీలక మార్గదర్శకాలు జారీచేసిన దిల్లీ ఎయిమ్స్ - Mpox Scare