MLA Taluka Sticker On Vehicle Number Plate in AP : మీ వాహనానికి నంబరు ప్లేటు సరిగా లేకుంటే అపరాధ రుసుము కట్టాల్సిందే. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసు, రవాణా శాఖల అధికారులు స్పష్టం చేస్తున్నా పలువురు వాహనాదారులు మాత్రం నంబరు ప్లేట్లను ఇష్టానుసారం రాయించుకుంటున్నారు. వారికి నచ్చినట్లు వాహనాలు తిప్పేస్తున్నారు. కొంత మంది అసలు నంబరు ప్లేటు లేకుండా వాహనాలు తిప్పుతున్నారు. 2016 నుంచి షోరూంలలో వాహనాలను కొన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వం అందజేస్తున్న హై సెక్యూరిటీ నంబరు ఫ్లేట్‌ను (High Security Number Plate) మాత్రమే బిగించుకోవాలన్న నిబంధన ఉన్నా చాలామంది అతిక్రమిస్తున్నారు.
వాహనాలకు వేర్వేరుగా : రవాణేతర వాహనాలకు నంబరు ప్లేటు తెలుపుగా ఉండి దానిపై నల్ల అక్షరాలు, అంకెలు ఉండాలి. రవాణా వాహనాలకు పసుపు నంబరు ప్లేటుపై నల్ల అక్షరాలు, అంకెలు ఉండాలి. రిజిస్ట్రేషన్ జరిగే ఎలక్ట్రిక్ వాహనాలు ఆకుపచ్చ నంబరు ప్లేటు ఉండాలి. నంబరు ప్లేట్‌ను బట్టి ఓ వాహనం చరిత్ర మొత్తం తెలుసుకోవచ్చు. దీని ప్రాధాన్యతను గుర్తించి కేంద్ర మోటారు వెహికల్ చట్టంలో (Central Motor Vehicle Act) కొన్ని నిబంధనలను ఉంచారు. వాహనం కేటగిరీని బట్టి కచ్చితంగా హై సెక్యూరిటీ నంబరు ప్లేట్‌ను మాత్రమే బిగించుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. నంబర్ ప్లేటుపై అంకెలు, అక్షరాలు తప్ప మరి ఏమీ ఉండకూడదు. ఇందుకు విరుద్ధంగా చాలా వాహనాలకు సినీనటులు, రాజకీయ నాయకులు చిత్రాలు ఉంటున్నాయి. అంకెలు, అక్షరాలను ఎలా పడితే అలా రాయించుకుంటున్నారు.
జరిమానా ఉంది : మోటారు వాహనాల చట్టం ప్రకారం ఫ్యాన్సీ నంబర్లతో తిరుగుతుంటే రవాణేతర వాహనాలకు 1,150 రూపాయలు, రవాణా వాహనాలకు రూ.1,300 జరిమానా విధిస్తారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే రూ.100 - రూ.150 వరకు చలానా రాస్తారు. ఇతర నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా మరింత పెరగడంతో పాటు కేసులు నమోదు వరకూ వెళ్తుంది.