MLA Somireddy Criticized Aurobindo 108 and 104 Services Fraud : అరబిందో సంస్థ దాతృత్వం పేరుతో వ్యాపారం చేసిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. 104 సేవల కింద 175 కోట్ల అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్లు గుర్తు చేశారు. నాణ్యమైన సేవలు అందించకుండా గోల్డెన్ అవర్ పాటించకుండా వేలమంది ప్రాణాలు తీశారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన అరబిందో యాజమాన్యానికి మరణ శిక్ష పడాలన్నారు.
నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడారు. అరబిందో సంస్థ అక్రమాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల ప్రాణాలు తీసిన అరబిందో సంస్థ నిర్వాహకులకు కఠిన శిక్ష విధించాలని కోరారు. 104, 108 వాహనాల సేవల్లో భారీ అవినీతి జరిగిందని స్పష్టం చేశారు. దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో జగన్ మోహన్ రెడ్డి చేసిన పాపాల్లో ఇది ఒకటి అని సోమిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అరబిందోపై అవ్యాజమైన ప్రేమ - అదనంగా రూ.175 కోట్లు చెల్లింపు
2019లో జీవీకే సంస్థ నుంచి 104, 108 నిర్వహణ బాధ్యతను అరబిందో సంస్థ లాగేసుకుందన్నారు. కేవలం 104 వాహనాల సేవల్లోనే రూ.175 కోట్లు అవినీతి జరిగిందని తెలిపారు. ఇక 108 వాహనాల సేవల్లో ఇంకెన్ని కోట్లు దోచుకుని ఉంటారని ప్రశ్నించారు. రోగులకు సేవలందిచాల్సిన 34లక్షల కేసుల్లో 17 లక్షల 40 వేల మందికి గోల్టెన్ అవర్ పాటించలేదని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ రిపోర్ట్ బయటపెట్టిందని గుర్తు చేశారు. రోగిని ఎక్కించుకున్న తరువాత కూడా అరగంట ఆలస్యం చేసినట్లు తెలిపారు. కాల్ చేస్తే అసలు రిసీవ్ చేసుకోలేదన్నారు. 731 వాహనాలు 108కి ఉంటే 600 వాహనాలు కూడా పని చేయలేదని విమర్శించారు.
మరణ శిక్షలు విధించినా తక్కువే : "17లక్షల 40వేల మంది రోగులను గోల్టెన్ అవర్‌లో ఆసుపత్రికి తీసుకువెళ్లలేక పోయారు. దీంతో ఎన్ని వేల మంది ప్రాణాలు పోయాయి? వేల మంది ప్రాణాలు తీసిన మీకు ఏం శిక్షలు విధించాలి. మరణ శిక్షలు విధించినా తక్కువే" అని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబిందో సంస్థ అనేది స్వయానా విజయసాయి వియ్యంకుడు, అల్లుడిదని తెలిపారు. వారికేమైనా కొత్త చట్టాలు ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం, మంత్రి సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. మళ్లీ అలాంటి తప్పు చేయాలంటేనే ఎవరైనా భయపడేలా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే కొత్త తరహా అవినీతికి జగనే బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. స్థలం కబ్జా, పొలం కబ్జాలూ చూశాం, ఏకంగా పోర్టునే కబ్జా చేయడమేంటని మండిపడ్డారు. గన్ను పెట్టి కాకినాడ పోర్టును కొట్టేయడమేంటని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిలదీశారు.
ఇవిగో 'అరబిందో' అక్రమాలు - అసెంబ్లీలో ఆధారాలు బయటపెట్టిన సోమిరెడ్డి
జగన్ మరో దాష్టీకం వెలుగులోకి - రాక్షస రాజకీయంతో కాకినాడ పోర్టు అరబిందో పరం!