MLA Raghu Rama Krishna Raju Fire on YCP Leaders : దొంగే, దొంగా దొంగ అన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఎవరినీ ఏమీ అనకముందే, తమను కొట్టారని దిల్లీలో విజయసాయిరెడ్డి, ఇతర నాయకులు చేసిన ప్రకటన చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు. గురువారం నాడు రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఒక ఎంపీపై తప్పుడు కేసు నమోదు చేసి, పట్టపగలే ఇంట్లో నుంచి అపహరించి తీసుకువెళ్లి, అర్ధరాత్రి చావ బాదినట్లుగా ఆధారాలున్నా సరే, గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.
వాళ్లు ఎంత దుర్మార్గులో తనకన్నా తెలిసిన వారు మరెవరూ ఉండరని అన్నారు. కొంతమందిని అన్యాయంగా గత ప్రభుత్వ హయాంలో చంపేశారని, ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని అపహరించి చితకబాదారంటే వాళ్లు ఎంతటి దుర్మార్గులో ఇట్టే తెలిసిపోతుందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లుగా తన ఫ్లెక్సీ కూడా కట్టకుండా అడ్డుకున్నారు. ఎవరైనా అభిమానంతో ఫ్లెక్సీ కడితే వారికి పోలీసులు ఫోన్లు చేసి బెదిరించేవారు.
ఇలా ఎన్నో దుర్మార్గాలు చేసిన వారు ఇప్పుడు ఏమీ జరగక ముందే ఏదో జరిగిపోతుందనే భయంతో ముందుగానే తమను కొడుతున్నారని, చంపేస్తున్నారని పెడ బొబ్బలు పెడుతున్నారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఒకటి, అర సంఘటనలు జరిగితే జరిగి ఉండవచ్చని, అది పార్టీలకు సంబంధం లేదన్నారు. ఇద్దరి వ్యక్తుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే ఘర్షణ పడి ఉండవచ్చన్నారు. ఇద్దరిలో దెబ్బలు తగిలిన వ్యక్తికి వైసీపీ ముసుగు తగిలించి, వైసీపీ వారిని చంపేశారంటూ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.
అంచనాలు తప్పాయి : ఎన్నికల అనంతరం వైసీపీ పార్టీ సంక నాకి పోబోతుందని నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నానని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీకి ఓ పాతిక సీట్లు మాత్రమే వస్తాయని ఎన్నోసార్లు చెప్పానని పేర్కొన్నారు. అయితే ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితమయిందని, తన అంచనా కూడా తప్పిందని రఘురామ కృష్ణంరాజు అంగీకరించారు. ఎన్నికల అనంతరం వైసీపీ నేతల మాటలు విని ఎవరైనా పందాలు కాస్తారేమోనని చెప్పి, ఓట్లు పడిపోయాయి పరిస్థితి దారుణంగా ఉందని పందాలు కాయవద్దని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు.
వైసీపీ నేతల మాటలు విన్నవారు పందాలు కాసి కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారని, దానికి కూడా వైసీపీ అధికారంలోకి రానందువల్లే మనస్థాపంతో వారు ఆత్మహత్యలు చేసుకున్నారని వక్ర భాష్యాన్ని చెప్పే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర 2.0 చేపడుతారేమోనని ఎద్దేవా చేశారు.
జగన్ గురించి వ్యక్తిగతంగా నేనేమీ మాట్లాడను : జగన్మోహన్ రెడ్డి గురించి ఇకపై వ్యక్తిగతంగా నేనేమి మాట్లాడ దల్చుకోలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి భాషలోనే చెప్పాలంటే మంచో చెడో ఆయన చేయాల్సింది చేశాడని వెళ్లిపోయాడ్న్నారు. ఇప్పుడు ప్రజలు గమనించేది మేము ఏమి చేస్తామని మాత్రమేనని, ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామో లేదో అన్నదానిపైనే వారు దృష్టి సారిస్తారన్నారు. అంతేకానీ జగన్మోహన్ రెడ్డిపై, వైసీపీ నాయకత్వంపై ప్రజల దృష్టి ఉండదని పేర్కొన్నారు. మేము ప్రజలకు ఇచ్చిన మాటను ప్రజలు బలంగా విశ్వసించారని తెలిపారు. అందుకే జగన్‌ను కాదనుకున్నారు.
తాము ఊహంచిందానికంటే ఎక్కువ సీట్లు గెలిపించారని అన్నారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. ప్రజలు అధికారాన్ని ఇవ్వలేద బాధ్యతను అప్పగించారని, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారన్నారు. ఇతరులపై దాడులు చేయడం కరెక్ట్ కాదని, తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులకు దిశా నిర్దేశం చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
పోలీసులు ప్రమాణ స్వీకారోత్సవ హడావుడిలో ఉన్నారని బహుశా తాను ఇచ్చిన ఫిర్యాదు పై ఒకటి, రెండు రోజుల వ్యవధిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చుని పేర్కొన్నారు. ఎంపీగా చిత్రహింసలు అనుభవించిన తాను, నాపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని మిలిటరీ ఆసుపత్రి నివేదికలు స్పష్టంగా పేర్కొన్న తర్వాత తనకు తాను న్యాయం చేసుకోకపోతే ఇక సామాన్య పౌరుడికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయే ప్రమాదం ఉందన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందనే ఉద్దేశంతోనే తాను ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. కచ్చితంగా తనకి న్యాయం జరిగితే, ప్రజలకు కూడా తమకు జరిగిన అన్యాయాలపై చట్ట ప్రకారం న్యాయం జరుగుతుందనే నమ్మకం వస్తుందనేది తన విశ్వాసమన్నారు.
20 శాతం ఓటర్లే కీలకం : గత ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు, ఈసారి ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలను ఇచ్చారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. గత ఎన్నికల్లో టీడీపీకి 40% ఓట్లు పోల్ కాగా, ఈసారి జగన్‌కు అంతే సంఖ్యలో ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాన పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసం 20% మాత్రమేనని తెలిపారు. వారే ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తారని చెప్పారు. మంచి జరుగుతుందనుకుంటే, ప్రజా సంక్షేమం కోసం వారు ఓటు వేస్తారన్నారు. వాళ్ల మనస్సు నొచ్చుకోకుండా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. అందులో ఎవరికి ఎటువంటి అపనమ్మకం ఉండాల్సిన అవసరం లేదన్నారు. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలని శాసనసభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశం చేశారన్నారు.
జనసేనకు ముఖ్యమైన శాఖలు - పవన్‌కు ఉప ముఖ్యమంత్రి సహా ఆ బాధ్యతలు!