MLA Ganta Srinivasa Rao Comments: జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలో పదికి పది కూటమి స్థానాలు కైవసం చేసుకోవడంపై భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో ఎంవీపీ కాలనీ నివాసంలో మీడియాతో మాట్లాడారు. 66 ఓట్లు భారీ మెజారిటీతో స్థాయి సంఘం ఎన్నికల్లో గెలిచామని, భవిష్యత్తులో ఏ ఎన్నిక అయినా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని గంటా శ్రీనివాసరావు చెప్పారు. వైఎస్సార్సీపీని ఒక మునిగిపోయే నావగా అభివర్ణించారు.
బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), వైఎస్ జగన్లు (YS Jagan Mohan Reddy) నైతికత, విలువలు కోసం మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తునట్టు ఉందని అన్నారు. వైఎస్సార్సీపీకి 80 శాతం ఓట్ల ఉన్నాయి, ఎలా ఎన్నికకు వెళ్తారని కూటమిపై విమర్శలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అభ్యర్థులను ఎలా బెదిరించి గెలిచారో అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర ప్రజలు అద్భుత తీర్పు 2024 ఎన్నికలో కూటమికి ఇచ్చారని, గతంలో బంగ్లాదేశ్, శ్రీలంకలో పరిస్థితులు చూశామని అన్నారు. ఎన్నికలు ఆలస్యం అయితే అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసే వాళ్లమని అన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి విజయం పునరావృతం అవుతుందని చెప్పారు. కూటమి గేట్లు తెరిస్తే పూర్తిగా వైఎస్సార్సీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు.
విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - వైఎస్సార్సీపీ క్యాంప్ రాజకీయం - Jagan Meeting Paderu YSRCP Leaders
ఆగస్ట్ 15 నుంచి 100 కాంటీన్లు మొదటి దశలో మొదలు పెడతామన్నారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని, ఈ రెండు రాష్ట్రానికి ప్రధాన ప్రాజెక్టులని చెప్పారు. రెండేళ్లలో అమరావతి కల సాకారం అవుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు. కాబట్టి ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు. మొత్తం సీట్లులో 10 శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష నేత హోదా ఉంటుందని, ఇదే జగన్మోహనరెడ్డి 2019లో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం మాట్లాడారని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు.
మరో రోజు ఆలస్యమైతే ముఖ్యమంత్రికి ఉన్న సౌకర్యాలు కావాలి అని వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అడుగుతారేమో అని గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. త్వరలో భోగాపురం ఎయిర్ పోర్ట్ కూడా సిద్ధమౌతుందని, విశాఖకు త్వరలోనే మెట్రో ప్రణాళిక సిద్ధం అవుతుందని తెలిపారు. విశాఖ నగరంలో 12పై వంతెనలు రాబోతున్నాయని వెల్లడించారు. విశాఖ నుంచి భోగాపురంకు ఎక్స్ ప్రెస్ హైవే వస్తోందిని, విశాఖలో భూములకు సంబందించి జరిగిన అక్రమాలపై మంత్రివర్గంలో కూడా చర్చ జరిగిందన్నారు. వైజాగ్ ఫైల్స్ మీద పూర్తి నివేదిక త్వరలోనే ఇస్తామన్నారు.
ఫేక్ రాజకీయం పండటం లేదని జగన్ ఫ్రస్టేషన్: మంత్రి అచ్చెన్నాయుడు