Minister Uttam Kumar Reddy Review On Irrigation : ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. భీమా, నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టుల గుత్తేదారులు సకాలంలో పనులు చేస్తున్నారా అని మంత్రి ఆరా తీశారు. ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, భీమా, నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టుల తాజా పరిస్థితులపై ఉత్తమ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిపై చర్చించారు. ప్రాజెక్టుల పూర్తికి ఏ చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తామన్నారు. ఇతర ప్రాజెక్టుల పూర్తి చేయడంపై కూడా చర్చించినట్లు తెలిపారు.
బడ్జెట్‌లో ఇరిగేషన్ శాఖకు రూ.28 వేల కోట్లు కేటాయించాలని కోరతామన్నారు. వాటిలో గత ప్రభుత్వం తీసుకున్న అప్పులకే ఎక్కువ భాగం రుణాలు వడ్డీ చెల్లింపులకే పోతుందన్నారు. రూ.8 వేల కోట్లు కొత్త ప్రాజెక్టుల పనుల కోసం కేటాయించినట్లు ఉత్తమ్ తెలిపారు. ఈ సంవత్సరం పనుల విస్తరణ కోసం రూ.11 వేల కోట్లు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆరున్నర లక్షల కొత్త ఆయకట్టును తీసుకురానున్నట్లు తెలిపారు. ముఖ్యమైన ప్రాజెక్టులను ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేస్తామన్నారు. అందుకోసం ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు.
కాళేశ్వరం రూపంలో రాష్ట్రంపై మోయలేని భారం మోపారు : ఉత్తమ్
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈనెల 20న దిల్లీకి వెళ్లనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దిల్లీలో ఎన్డీఎస్ఏ ఛైర్మన్‌తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో ప్రాజెక్టులపై మరోసారి సమీక్షిస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి మహబుబ్‌నగర్ జిల్లాలోని నీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నీటిపారుదల శాఖను అస్తవ్యస్తంగా తయారు చేసిందని మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖలో ఉన్న సమస్యలను పూర్తి స్థాయిలో మారుస్తామన్నారు. త్వరలోనే ఇరిగేషన్ శాఖలో పదోన్నతులు, బదిలీలు చేపడతామన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.