Minister Tummala Nageswara Rao on Rythu Bharosa Scheme : రాష్ట్రంలో రైతుబంధు స్థానంలో ప్రభుత్వం రైతు భరోసా పథకం తీసుకొస్తున్న దృష్ట్యా పెట్టుబడి సాయం కూడా సంవత్సరానికి ఎకరాకు రూ.15,000 చొప్పున అందజేయనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా మరో రూ.5 వేలు పెంచి అందజేయబోతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 గ్రామీణ నియోజకవర్గాల్లో ఉన్న రైతు వేదికల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన వర్చువల్గా సచివాలయం నుంచి మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉప ఛైర్మన్ చిన్నారెడ్డి, అఖిల భారత కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రైతు నాయకులు, ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు.
ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా పథకం అమలుపై రైతులు నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయాలు సేకరించారు. చాలా మంది రైతులు ఈ పథకం సాగు చేసే వారికి, అదే విధంగా సాగులో ఉన్న భూమికే పెట్టుబడి సహాయం అందించాలని సూచించారు. అంతేకాకుండా గరిష్ఠ పరిమితి విధించి రైతుభరోసా పథకం వర్తింపచేయాలని కోరారు. అనంతరం రైతు నేస్తం కార్యక్రమంలో వెల్లడించిన, రాత పూర్వకంగా సేకరించిన సూచనలన్నింటినీ క్రోడీకరించి ఒక నివేదిక తయారు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీని మంత్రి తుమ్మల ఆదేశించారు.
అయితే రైతుబంధు తరహాలో ప్రజాధనం వృథా కాకుండా ఉండేందుకు పటిష్ఠ విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల చెప్పారు. గతంలో సాగులోలేని భూములకు కూడా రైతుబంధు వర్తింపచేసి 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనం వృథా చేశారని ప్రస్తావించారు. ఇంకా ప్రభుత్వం రైతుభరోసాకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. పూర్తిగా అందరి అభిప్రాయాలు, శాసనసభలో సభ్యులతో చర్చించిన తర్వాతనే పథకం తీసుకొస్తామని స్పష్టం చేశారు. రైతన్నల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కాస్త ఆలస్యమైన కూడా అర్హులకు మాత్రమే అందే విధంగా రైతు భరోసా పథకం రూపకల్పన చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
రైతుల హర్షం : దాదాపు అన్ని జిల్లాల నుంచి మంత్రి ఇలా ప్రత్యక్షంగా రైతుల అభిప్రాయాలు తీసుకోవడం శుభపరిణామం అని రైతులు వాపోయారు. రైతులకు వర్తింపచేసే పథకాల్లోనూ, విధివిధానాల్లోనూ భాగస్వామ్యం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారి సూచనలు అందించారు. 93 శాతం వాటా ఉన్న సన్న, చిన్నకారు రైతుల వాటా రైతుబంధు మొత్తంలో 68 శాతం కూడా లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా 17.5 శాతం ఉన్న కౌలు రైతులను పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆక్షేపించారు.
అన్నదాతలకు గుడ్ న్యూస్ - జులై నుంచి రైతు భరోసా అమలు - RYTHU BHAROSA SCHEME FROM JULY