Minister Thummala Nageswara Rao on Rythu Bharosa : రైతు భరోసాపై కర్షకులు వెల్లడించిన అభిప్రాయాలను చర్చించడానికి అసెంబ్లీలో ఒక రోజు మొత్తం సమయం కేటాయిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసాపై అన్నదాతలు, రైతు సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రేషన్‌కార్డు లేని వారికి రుణమాఫీ ఉండదనే దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్న మంత్రి, రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు.
రైతు భరోసా అమలు విధివిధానాలపై అన్నదాతల అభిప్రాయ సేకరణకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులతో ముచ్చటించింది. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. గత పదేళ్ల కాలంలో రైతులకు పంటల బీమా సదుపాయం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వాటా కూడా చెల్లించి అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సూచించారు. ఆర్థికపరంగా ఇబ్బందులున్నా రుణమాఫీకి 31వేల కోట్లు కేటాయించి లక్షలోపు రుణాలను మాఫీ చేశామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
రైతు భరోసా ఏమేరకు ఇవ్వాలనే అంశం ఎలాంటి నిర్ణయాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకోలేదు, అందువల్లనే మీ వద్దకు వచ్చి అభిప్రాయాలు తీసుకుంటున్నామని రెవెన్యూశాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంకంటాక్స్ ఫైల్ చేసే రైతులకు రైతు భరోసా ఇవ్వరని కొంతమంది గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతుభరోసా నిధులు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టారని చెబుతున్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీకి తేడా తెలియని మీరు పదేళ్ల పాటు ఎలా పాలించారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కుటుంబాన్నిగుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు ప్రస్తావన తీసుకొస్తే రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఇస్తారని దుష్ప్రచారం చేశారని పొంగులేటి విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పేరిట 25 వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రతి పైసా, నిజమైన లబ్దిదారులకు అందించాలన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని స్పష్టం చేశారు. రైతులు పంటబీమా ఇవ్వాలని అడుగుతున్నారని, తప్పకుండా రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లించి పరిహారం అందేలా చూస్తామన్నారు. రైతు భరోసాపై రైతులు, శాసనసభ్యుల అభిప్రాయాలు కలుపుకొని విధానపరమైన నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి, అవసరమైతే ఒక్కరోజు శాసనసభలో మొత్తం అన్నదాతల అభిప్రాయాలపై చర్చిస్తామని వెల్లడించారు.
రైతులు కేవలం వరిపంటకు పరిమితం కాకుండా ఆయిల్ పాం పంటపై దృష్టి పెట్టాలన్నారు. పామాయిల్ రైతులకు కలెక్టర్‌కు,సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఎలాగైతే ప్రతినెలా ఆదాయం ఉంటుందో అదే తరహాలో ఆదాయం ఉంటుందని వివరించారు..