Minister Ponguleti on New Revenue Law : రాష్ట్రంలో త్వరలో పటిష్ఠమైన రెవెన్యూ చట్టం తీసుకు వస్తామని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాాస్ రెడ్డి పేర్కొన్నారు. అన్నింటికీ సబ్ కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజా హోటల్లో ట్రెసా ఆధ్వర్యంలో జరిగిన నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా చర్చా వేదిక కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సామాన్యులపై ప్రభావం : ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ఏ చట్టంలోనైనా లొసుగులు లేకుండా సరిదిద్దకపోతే, వేలాది కుటుంబాలు రోడ్డు పాలవుతాయని ఆయన తెలిపారు. ఏ ప్రభుత్వమైనా చట్టాలు సరిగా రూపొందించకపోతే, ఆ ఫలితాలు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ధరణి స్థానంలో అత్యంత పారదర్శకంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చే క్రమంలో సామాన్యుల నుంచి మేధావుల వరకు అన్ని స్థాయిల్లో అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
నూతన చట్టం రూపకల్పన : కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరూ ముక్కున వేలు వేసుకునేలా, కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. అది దేశానికి ఓ నమూనాగా ఉండబోతుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిల్లో పదోన్నతులు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ట్రెసా, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులుకు మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు.
కొత్త ఆర్‌ఓఆర్ చట్టంపై సలహాలు, సూచనల స్వీకరణలో భాగంగా ఆయా వర్గాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. గతంలో వీఆర్ఓలుగా పనిచేసి ఇతర శాఖల్లోకి వెళ్లిన వారందరినీ మళ్ళీ రెవెన్యూ శాఖలోకి తీసుకురావాలని మంత్రి పొంగులేటికి ట్రెసా విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో భూ చట్టాల రంగ నిపుణులు ఎం.సునీల్‌కుమార్, ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, గౌతంకుమార్, తదితరులు పాల్గొన్నారు.
"రాష్ట్ర ప్రభుత్వం అన్నింటికీ సబ్ కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. భవిష్యత్‌లో ఎటువంటి భూ సమస్యలు రాకుండా ఉండేందుకు నూతన రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నాం. రాష్ట్రంలో త్వరలో పటిష్ఠమైన రెవెన్యూ చట్టం తీసుకువస్తాం". - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి