MINISTER LOKESH VS MLC BOTSA : వైఎస్సార్సీపీపై మంత్రి లోకేశ్ నిప్పులు చెరిగారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబును అవమానించారని ఈ సందర్భంగా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని దుర్భాషలాడారని మండిపడ్డారు. అయితే తల్లిని అవమానించడాన్ని ఎవరూ సమర్థించరని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
వాళ్లకు ఎన్నికల్లో టికెట్లు ఎందుకిచ్చారు: వీడియోలన్నీ ఉన్నాయని లోకేశ్ తేల్చిచెప్పారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోజు తన తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రావట్లేదా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలను ప్రశ్నించారు. తాము ఎప్పుడూ జగన్ కుటుంబంపై మాట్లాడలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రతిరోజూ అసెంబ్లీకి వచ్చారని, తన తల్లిని అవమానించాకే ఆవేదనతో సభ నుంచి వాకౌట్ చేశారని తెలిపారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలను ప్రశ్నించారు.
మాట్లాడుకోవడం అనవసరం: ఈ సమయంలో సభలో లేని మనిషిపై మాట్లాడుకోవడం అనవసరమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. లోకేశ్ తల్లిపై చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించట్లేదని చెప్పుకొచ్చారు. తన తల్లిని అవమానపరిచిన వాళ్లకు ఎన్నికల్లో టికెట్లు ఎందుకిచ్చారని లోకేశ్ ప్రశ్నించారు. టికెట్లు ఇచ్చినప్పుడు వాళ్లను సమర్థించినట్లే కదా అని నిలదీశారు.
"పెద్దల సభ అని గుర్తుంచుకోండి - 'సోషల్ సైకో'లకు ఎలా మద్దతిస్తారు?"
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి లోకేశ్ చిట్‌చాట్: అసెంబ్లీకి రాకపోతే ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని జగన్ బహిష్కరించినట్లే అని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి నారా లోకేశ్ చిట్ చాట్ చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు కావడంపై లోకేశ్ వద్ద పలువురు కూటమి ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని లోకేశ్ అన్నారు.
ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని జగన్, ఆయన పార్టీ గౌరవించడం లేదని భావించాలన్నారు. అసెంబ్లీకి రాకపోతే ఆయనను, వాళ్ల ఎమ్మెల్యేలను ఎన్నుకున్న ప్రజలను కూడా జగన్ అవమానించినట్టే కదా అని లోకేశ్ అభిప్రాయపడ్డారు. వాళ్ల ఎమ్మెల్యేలు కూడా కొంతమంది సభకు రావాలని కోరుకుంటున్నారని తెలిసిందని టీడీపీ ప్రజాప్రతినిధులు లోకేశ్‌కు వివరించారు.
అలాగైతే మీకూ మాకు తేడాలేదు - ప్రతిపక్షం కాకపోయినా ప్రజాపక్షం అనిపించుకోవాలి: షర్మిల