Minister Nara Lokesh Review on SALT Project: నాణ్యమైన విద్యాబోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సి ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ (SALT) ప్రాజెక్టు అమలుతీరుపై పాఠశాల విద్యాధికారులు, సంబంధిత ఏజన్సీల ప్రతినిధులతో ఉండవల్లి నివాసంలో మంత్రి సమీక్షించారు.
గత ప్రభుత్వ హయాంలో సాల్ట్ ప్రాజెక్టు అమలులో వెనుకబడటంపై కారణాలను తెలుసుకున్నారు. నాడు-నేడు, సాల్ట్ వంటి పథకాలపై గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కాగితాల్లో చూపుతోందని, అదే నిజమైతే గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ప్రశ్నించారు. దీనిపై లోతైన విశ్లేషణ చేసి, నాణ్యమైన విద్య అందించి మెరుగైన ఫలితాల సాధనకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. రాబోయే అయిదేళ్లలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.
'నైపుణ్య గణనకు ఏర్పాట్లు చేయండి' - అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశం - Minister Lokesh on Skill Census
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్‌నెట్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఎసెస్మెంట్ మరింత శాస్త్రీయంగా ఉండే విధంగా డిజైన్లో మార్పులు చేయాలని ప్రథమ్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. డిజిటలైజ్డ్ ఎసెస్మెంట్ను మరింత సమర్థవంతంగా నిర్వహించి ఆన్లైన్కు అనుసంధానించడంపై దృష్టి సారించాలని ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ సంస్థను మంత్రి ఆదేశించారు.
టీచింగ్ టూల్స్ అబ్జర్వేషన్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ బోధనా పద్ధతులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని లీడర్షిప్ ఫర్ ఈక్విటీ (LFE) ప్రతినిధులకు సూచించారు. ఆయా ఏజన్సీలు నిర్వహిస్తున్న ఎసెస్మెంట్, శిక్షణా కార్యక్రమాలు అర్థవంతంగా, ఫలితాల మెరుగుదలకు దోహదపడేలా ఉండాలని అన్నారు. ఇంటర్మీడియట్లో మార్కులకు బదులుగా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రజాప్రతినిధులంతా మోడల్ పీటీఎం సమావేశాలకు హాజరై తల్లిదండ్రుల మనోగతాన్ని తెలుసుకుంటామని, ప్రభుత్వ పాఠశాలల మెరుగైన పనితీరు కోసం తల్లులను భాగస్వాములను చేయాలని అన్నారు. బాల్యం నుంచే మహిళలను గౌరవించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు.