Minister Nara Lokesh Comments : ప్రజా కోర్టులో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిందని, పరువు నష్టం కేసు కూడా గెలుస్తామని ఆశిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తనపై అసత్య కథనాలు ప్రచురించిన సాక్షి మీడియాపై 75 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన మంత్రి లోకేశ్ విశాఖ కోర్టుకు నేడు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పరువు నష్టం కేసు గెలుస్తామని ఆశిస్తున్నామని తెలిపారు. బ్లూ మీడియాలో ఎలాంటి మార్పు రాలేదని, తప్పుడు వార్తలు వేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారని, అందుకే 2024లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని అన్నారు. ఇప్పటికైనా సాక్షి వైఖరి మార్చుకుని వాస్తవాలు చెప్పాలని హితవు పలికారు. దుష్ప్రచారం చేసి తప్పుడు రాతలు రాస్తే ప్రభుత్వ వదలదని హెచ్చరించారు. ప్రజలు తమ కుటుంబాన్ని దీవించి ఆరుసార్లు అవకాశమిచ్చారని, ప్రజలు ఇచ్చిన అవకాశాలను సేవ చేసేందుకు వినియోగించామన్నారు.
100 రోజుల్లో టీసీఎస్ ఏర్పాటుకు కొబ్బరికాయ కొడతాం: వచ్చే 100 రోజుల్లో టీసీఎస్ ఏర్పాటుకు కొబ్బరికాయ కొడతామని లోకేశ్ స్పష్టం చేశారు. త్వరలో మెగా డీఎస్సీ తేదీలు ప్రకటిస్తామన్న లోకేశ్, ఎన్డీఏ అధికారంలో ఉన్నంత కాలం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని హామీ ఇచ్చారు. చట్టాలు ఉల్లంఘించిన వారిపై రెడ్‌బుక్ ఓపెన్ అయిందని తెలిపారు. గత ప్రభుత్వంలో యూనివర్శిటీల్లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటామన్నారు.
పరువు నష్టం కేసు విచారణ వాయిదా: మరోవైపు లోకేశ్ వేసిన పరువు నష్టం కేసు విచారణ వచ్చేనెల 15కు వాయిదా పడింది. పరువు నష్టం దావా కేసులో విశాఖ కోర్టుకు నారా లోకేశ్ వచ్చారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు, ప్రతిష్టకు భంగం కలుగజేసేందుకు అవాస్తవాలతో కథనాలు వేశారని రూ.75 కోట్లకు నారా లోకేశ్ పరువునష్టం దావా వేశారు. పరువుకు భంగం కలుగజేసేందుకు అసత్య కథనాలు ప్రచురించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తప్పుడు కథనం రాసిన సాక్షిపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ పోరాటం చేస్తున్నారు.
సాక్షి పత్రికపై న్యాయపోరాటంలో భాగంగా లోకేశ్ గతంలోనూ కోర్టుకు హాజరయ్యారు. అసత్య ఆరోపణలతో తనను కించపరిచేలా కథనం రాశారంటూ సాక్షి పత్రికకు నోటీసులు పంపించారు. అయినా ఆ వార్తపై సవరణ ప్రచురించకపోవడంతో పాటు నోటీసులకు స్పందించలేదు. దీంతో పరువునష్టం దావా దాఖలు చేశారు. సాక్షి కథనంలో రాసిన తేదీల్లో తాను విశాఖలో లేనని, అయినా అక్కడి ఎయిర్ పోర్టులో ఏవో తిన్నట్లు రాశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.