Bonalu Festival 2024 : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లయిన సందర్భంగా ఆషాఢబోనాల పండుగను దశాబ్ది బోనాల ఉత్సవాల పేరిట ఘనంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగకు ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసిందని,ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున 28 ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
తెలంగాణ బోనాల పండగకు వేళాయే - జులై 7 నుంచే మహా జాతర ప్రారంభం - Bonalu Festivals 2024
ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి జులై 5 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను, మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బోనాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీలతో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఫాగింగ్, పార్కింగ్ కేంద్రాలు, టాయిలెట్లు, రోడ్ల నిర్వహణపై జీహెచ్ఎంసీ ప్రణాళికబద్ధంగా పనులు చేయాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా, డ్రైనేజి నిర్వహణపై జలమండలి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
క్యూలైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని, వాలంటీర్లను నియమించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం బ్యాటరీ వాహనాలను వినియోగించాలని చెప్పారు. క్యూలైన్‌లో పిల్లలకు బాలామృతం వంటి పోషకాహారం ఇవ్వాలని అంగన్‌వాడీ పోలీసులు నిఘా, భద్రత ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రసారాల కోసం ప్రత్యేక ఛానెల్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయాలని దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
బోనాల జాతరను గ్రంథస్తం చేయడంతో పాటు డాక్యుమెంటరీ రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. మెట్రో రైళ్ల అదనపు సర్వీసులతో పాటు, రాత్రి ఎక్కువ సమయం నడపాలని సూచించారు. అమ్మవారి ఘటం ఊరేగింపు కోసం కర్ణాటక నుంచి తీసుకొస్తున్న ఏనుగుకు తగిన విశ్రాంతి ఇవ్వాలని మంత్రి సురేఖ సూచించారు. జానపద కళారూపాలు ప్రదర్శించాలని సాంస్కృతిక శాఖకు తెలిపారు.
భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ పరంగా ఎలాంటి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సమావేశంలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ రవి గుప్తా, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీకి ప్రజలు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు : మంత్రి కొండా సురేఖ