Minister Karumuri Abusive Words on Farmer : పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరో మారు అన్నదాతపై నోరు పారేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరంలో శనివారం మంత్రి కారుమూరి పర్యటించారు. ధాన్యం విక్రయాల సమస్యలను తెలుసుకునే క్రమంలో ఆయన గోటేరు గ్రామానికి చెందిన రైతుతో ధాన్యం బస్తాలపై కూర్చొని కాసేపు మాట్లాడారు.
అయితే ఈ కమ్రంలో రైతు పైకి లేచారు. దీంతో మంత్రి ‘ఓర్నీయ.. కూర్చో నేను కూడా రైతునే’ అంటూ దుర్భాషలాడారు. మంత్రి స్థాయిలో ఉండి ఇలా బూతు మాటలు మాట్లాడుతుండటంపై పక్కనున్న రైతులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకు వైసీపీ ప్రజాప్రతినిధి ఇచ్చే గౌరవం ఇదానే అంటూ సామాజిక మాధ్యమాల్లో మంత్రి కారుమూరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Minister Karumuri Nageswara Rao: ఓయ్ నోరు మూసుకో.. రైతుపై మంత్రి రుసరుసలు
Karumuri Nageswara Rao Rude Behavior: రైతులను దుర్భాషలాడటం మంత్రి కారుమూరికి కొత్తేం కాదు. గతంలో కూడా పలుమార్లు నోరుపారేసుకున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిన సమయంలో వేల్పూరు వచ్చిన మంత్రికి ధాన్యం మొలకలు వచ్చాయని, గోనె సంచులు ఇవ్వడం లేదని ఓ రైతు గోడు వినిపించగా ‘తడిస్తే మొలకలు రాకపోతే ఏం వస్తాయి వెర్రిపప్పా’ అంటూ దుర్భాషలాడారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘ఆ మాట బూతు కాదని, ఎర్రిపప్పా అంటే బుజ్జికన్నా అని అర్థం అంటూ అప్పట్లో మంత్రి సెలవిచ్చారు.
అదే విధంగా మరోసారి అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని పరిశీలించేందుకు ఏలూరు జిల్లా నాచుగుంట, ఉంగుటూరులో మంత్రి కారుమూరి పర్యటించారు. ఆ సమయంలో రైతులు తమ సమస్యలను మంత్రి వద్దకు చెప్పుకున్నారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మంత్రి, ఓ రైతును ఓయ్ నోరు మూసుకోనిపోవయ్యా అంటూ మండిపడ్డారు. అదే విధంగా ధాన్యం తడిసి మొలకెత్తిందని సమస్య విన్నవించిన రైతుపై నేనేం చేస్తానంటూ మంత్రి దుర్భాషలాడారు. మరో సందర్భంలో రైతులు ఆయనకు సమస్యలు చెబుతుండగా వీడియో తీస్తున్న విలేకరులను సైతం ఇక చాలు వీడియో తీయడం ఆపాలంటూ చేతితో మంత్రి సైగ చేశారు.
తాజాగా ఇప్పుడు మరోసారి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతుపై నోరుపారేసుకున్నారు. అయితే ఎప్పటిలాగే ఇప్పుడు కూడా తన వైఖరిని సమర్థించుకున్నారు. ఓర్నియ.. కూర్చో అన్నది ఆత్మీయ పలకరింపేనని చెప్పుకొచ్చారు. ఆ రైతును పక్కన పెట్టుకొని ఈ వివరణ ఇస్తున్నట్లుగా ఉన్న వీడియో విడుదల చేశారు.