Minister Atchannaidu held Cooperative Meeting : కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలని మంత్రి అచ్చన్నాయుడు తెలిపారు. చిట్టచివరి కౌలు రైతుకు న్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని, ఇందుకు కొత్త సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రతి కౌలు రైతుకు బ్యాంక్ రుణాలు : వైసీపీ ప్రభుత్వం 2019 లో తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సొంత రైతులే వ్యవసాయాన్ని వదిలేస్తున్న తరుణంలో సాగు బాధ్యతను కౌలు రైతులే తీసుకుంటున్నారని అన్నారు. మన రాష్ట్రంలో 90 శాతానికిపైగా కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. సీసీఆర్‌సీ పేరిట అనాలోచిత చట్టాన్ని తెచ్చి అన్నదాతలను గత వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. సీసీఆర్‌సీ కార్డులు రాక, ప్రభుత్వ ప్రయోజనాలు అందక, రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాకతో రైతులకు మళ్లీ మంచిరోజులు వచ్చాయని, వ్యవసాయానికి ఊతమిచ్చేలా సహకార వ్యవస్థ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
మీడియా కథనాలపై విచారణ : కౌలు రైతులకు రుణాలు సులభంగా అందే పరిస్థితి రావాలని, ఇప్పటికే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారన్నారు. సహకార వ్యవస్థలో ఈ-కేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. సహకార సంఘాల్లో అవినీతిపై వస్తున్న మీడియా కథనాలపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతి రైతు భూమిని వెబ్ ల్యాండ్‌లో పెట్టి గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు : ఆప్కాబ్ - డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలన్నారు. అన్ని జిల్లాల్లో ఆప్కాబ్, డీసీసీబీ శాఖలను విస్తరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. సహకార బ్యాంకులకు, సంఘాలకు రావల్సిన బకాయిలను అందజేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థలో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి డిజిటైజేషన్ చాలా అవసరమని, అధికారులంతా ఇందుకు తగినవిధంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆప్కాబ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను మంత్రి ప్రారంభించారు. అలాగే అందులో మొట్టమొదటి సభ్యుడిగా చేరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధశాఖల ప్రత్యేక కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.ఎస్.రెడ్డి, ఆప్కాబ్ ఛైర్మన్ ఎ.బాబు, తదితరులు పాల్గొన్నారు.
చితికిన కౌలు రైతు బతుకు - గడిచిన ఐదేళ్లుగా ధీమా లేదు, బీమా రాదు! - Jagan Neglect Tenant Farmers