Minister Anagani Satya Prasad in Revenue Conference For Land Issues : రాష్ట్రంలో భూ వివాదాలకు చెక్‌పెట్టేలా రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 'మీ భూమి- మీ హక్కు’ పేరిట రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేసి వివాదాలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో 60శాతం భూములు, రిజిస్ట్రేషన్లకు సంబంధించినవేనన్న ఆయన వాటిని ఎక్కడిక్కకడ పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.
మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రాంతీయస్థాయి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. శాఖాపరంగా అమలవుతున్న 12 అంశాలపై సమీక్షించారు. అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతో కలిసి మంత్రి విలేకర్లతో మాట్లాడారు.
భూముల రీసర్వే పేరిట గత ప్రభుత్వం పేదల భూములు దోచుకుందని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. విశాఖలో నిర్వహించిన ప్రాంతీయస్థాయి రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో భూముల రీసర్వే చేపట్టినప్పటికీ వైఎస్సార్సీపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాలు దోచుకున్నారని అనగాని మండిపడ్డారు.
భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా మీభూమి-మీహక్కు పేరిట రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నామన్నారు. విశాఖలో జరిగిన భూ అక్రమాల్లో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సదస్సులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోదియా, సీసీఎల్‌ఏ జయలక్ష్మి పాల్గొన్నారు.
భూ ఆక్రమణలపై కఠినంగా ఉండాలి - ప్రజలు మెచ్చుకునేలా కలెక్టర్లు వ్యవహరించాలి : సీఎం చంద్రబాబు
'ఇప్పటివరకు 6,680 గ్రామాల్లో సదస్సులు నిర్వహించాం. ఫ్రీహోల్డ్ భూముల విషయంలో అనేక అక్రమాలు మా దృష్టికి వచ్చాయి.‘విశాఖలో జరిగిన భూఆక్రమణలు, రికార్డుల మార్పిడి వంటి అక్రమాల్లో కొందరు అధికారుల పాత్రపై ఫిర్యాదులు అందాయి. వాటిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఒకసారి 22A నుంచి తొలగించే భూములకు పూర్తి వెసులుబాటు కల్పించేలా డిజిటల్ పత్రాలు అందజేస్తాం. అక్రమాలకు తావులేకుండా భూ సర్వే నిర్వహిస్తాం.' -మంత్రి సత్యప్రసాద్