Middle Class Dream House: సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనగలిగే ధరల్లో ఇళ్ల నిర్మాణాలు అంతగా లేకపోవడంతో ఆయా వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వాలు పేదవారి కోసం వేర్వేరు పథకాల కింద ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాయి. సంపన్న వర్గాలు ప్రీమియం ఇళ్లను పోటీపడి మరీ కొంటున్నాయి. అయితే మధ్యతరగతి వర్గాలు ఇల్లు కొనలేక సతమతమవుతున్నాయి.
కేంద్రం ఇదివరకు ప్రవేశపెట్టిన పీఎంఏవై (Pradhan Mantri Awas Yojana) గృహరుణ ఆధారిత వడ్డీ సబ్సిడీతో కొనుగోలుదారులకు భారం తగ్గి ఈఎంఐ చెల్లింపుల్లో కొంత వెసులుబాటు లభించేది. ఎంఐజీ (Middle Income Group) విభాగంలో 1800 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు ఈ స్కీమ్ అమలు చేసినప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందారు. అయితే ఇప్పుడు అని ఎల్‌ఐజీ (Lower Income Group) వరకే పరిమితమైంది. ఈ స్కీమ్‌కి విస్తరిస్తే మధ్యతరగతి వర్గాలకు ఉపయోగకరంగా ఉంటుందనే భావన ఉంది.
పట్ణణాల్లో హౌసింగ్ బోర్డుల ఆధ్వర్వంలో అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టేవారు. అధిక ఆదాయం, మధ్య, తక్కువ ఆదాయ వర్గాలుగా HIG, MIG, LIGగా విభజించి ఇళ్లను, స్థలాలను విక్రయించే పరిస్థితి ఉండేది. అయితే కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టడంలో హౌసింగ్ బోర్డులు వెనకబడటంతో ప్రైవేట్ రంగం ఊపందుకుంది.
మొదట్లో అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న ఇళ్ల నిర్మాణం చేపట్టినా, ఆ తర్వాత ప్రీమియం ఇళ్లవైపు మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. భూముల ధరలు భారీగా పెరగడంతో సరసమైన ధరల ప్రాజెక్ట్‌లు చేపట్టలేకపోతున్నామని, విలాసవంతమైన ఇళ్ల నిర్మాణం చేపడితే విక్రయాలు బాగుంటున్నాయని బిల్డర్లు చెబుతున్నారు.
ఇల్లు కొనాలనుకుంటున్నారా - హైదరాబాద్‌లో ఈ ప్రాంతానికి ఫుల్ డిమాండ్
మధ్యతరగతి వాళ్లు ఎందుకని కొనలేకపోతున్నారు? : మధ్యతరగతి వర్గాల్లో ఎక్కువ శాతం మంది రుణం ద్వారానే ఇల్లు కొంటుంటారు. కొవిడ్ సమయంలో ఆర్‌బీఐ రెపో రేటు 4% కాగా, ప్రస్తుతం 6.5 %గా ఉంది. ఫలితంగా 2022 మే నుంచి వడ్డీరేట్లు పెరగడంతో లోన్ లభ్యత తగ్గిపోయింది. భూముల ధరలు పెరగడంతో పాటు, దీనితో పాటు ఇంటి ధరలను పెంచాల్సి రావడంతో అందుబాటు ధరల్లో ఇంటి లభ్యత తగ్గిపోయింది.
ఒకవేళ ఇళ్లు నిర్మించినా: ఎవరైనా సరే సరసమైన ధరలో ఇంటి నిర్మాణాలు చేపట్టినా వాటిని విక్రయించడం పెద్ద సవాల్‌గా మారిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మధ్యతరగతి వర్గాల్లో ఆ మేరకు కొనుగోలు శక్తి లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించిన రిపోర్టు ప్రకారం 50 లక్షల రూపాయల లోపు ఇళ్ల విక్రయానికి 8.2 త్రైమాసికాలు పడుతోంది. 50 లక్షల రూపాయలు నుంచి కోటి రూపాయల లోపు ఇళ్ల విక్రయాలకు 4.8 త్రైమాసికాలు, కోటి రూపాయల పైన ధరకు విక్రయిస్తున్న ఇళ్లకు 4.9 త్రైమాసికాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం బిల్డర్లు డిమాండ్ ఉన్న ప్రీమియం ఇళ్ల నిర్మాణాలనే చేపడుతున్నారు.
హైదరాబాద్‌లో సొంతింటి కల - 'మిడిల్ క్లాస్'కు ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ఛాయిస్
ఎంత ప్రభావం పడుతుంది?:
- 3 లక్షల రూపాయల వార్షికాదాయం కల్గిన వ్యక్తి 13.5 లక్షల రూపాయల గృహరుణం తీసుకుంటే 7.25% వడ్డీ లెక్కకడితే ఈఎంఐ 10 వేల 670 రూపాయలు అవుతుంది. వార్షికాదాయంలో 43% ఈఎంఐకి వెళుతుంది.
- వడ్డీరేట్లు 9.2 %కి పెరిగితే ఈఎంఐ 12 వేల 320 అవుతుంది. అప్పుడు ఆదాయంలో 49% ఈఎంఐ కింద చెల్లించాలి.
- వడ్డీరేట్లతో పాటూ ఇళ్ల ధరలూ పెరిగితే అధిక రుణం తీసుకోవాలి. 16.87 లక్షల రూపాయల రుణం తీసుకుంటే ఈఎంఐ 15 వేల 401 రూపాయలు అవుతుంది. అప్పుడు వార్షికాదాయంలో ఈఎంఐకే 62% కేటాయించాలి. హైదరాబాద్ మార్కెట్లో 3వ పరిస్థితి ఉంది. దీంతో ఎక్కువ మంది ఇంటిని కొనలేకపోతున్నారు.
12 లక్షల రూపాయల ఆదాయం ఉన్నా కొనగలమా?
- ఇంటి ధర 45 లక్షల రూపాయల విలువలో 80% వరకు రుణం తీసుకుంటే 36 లక్షలు రూపాయలు అవుతుంది. 20 ఏళ్ల వ్యవధి ఎంచుకుంటే ఈఎంఐ 28 వేల 454 రూపాయలు చెల్లించాలి. వడ్డీరేటు 7.25% ఉంటేనే వార్షికాదాయంలో 28% ఈఎంఐకి వెళుతుంది. కాబట్టి ఎక్కువ మంది దీనికే మొగ్గుచూపుతారు.
- వడ్డీరేటు 9.20%కి పెరగడంతో ఈఎంఐ 32 వేల 855 రూపాయలకి పెరిగింది. వార్షికాదాయంలో ఇంటికోసం చెల్లింపులకే 33% కేటాయించాల్సి వస్తుంది. అయినా సరే చాలా మంది ఇంటిని కొనడానికి సిద్ధపడతారు.
వడ్డీరేట్లు పెరుగుదలతో ప్రభావం ఎలా ఉంటుంది?:
- 45 లక్షల రూపాయల ఇల్లు కాస్త 50.40 లక్షల రూపాయలకు పెరిగితే, అప్పుడు 80% గృహరుణం 40.32 లక్షల రూపాయలు వస్తుంది. ఈఎంఐ ఏకంగా 36 వేల 797కి పెరుగుతుంది. వార్షికాదాయంలో ఈఎంఐ భాగం 41% దాటుతుంది. దీంతో ఎక్కువ మంది ఈ విధంగా కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ ఈ స్టేజ్‌లోనే ఉంది.
- వార్షికాదాయం పది లక్షల రూపాయల లోపు ఉండి గృహరుణంతో ఇల్లు కొనేందుకు ఆధారపడుతున్న వారు 77% మంది ఉన్నారు.
- 600 నుంచి 1200 చదరపు అడుగుల విస్తీర్ణం కల్గిన ఎంఐజీ విభాగంలో దేశం వ్యాప్తంగా ఇళ్ల కొరత 5.3 మిలియన్లుగా ఉంది.
- 2030 సంవత్సరం నాటికి వీటి డిమాండ్ ఈడబ్ల్యూఎస్ విభాగంలో అత్యధికంగా 46 % ఉంటే ఎల్‌ఐజీలో 33 %, ఎంఐజీలో 16%, హెచ్‌ఐజీలో 5 % ఉంటుందని రిపోర్టు అంచనా వేసింది.
మీ ఇంట్లో పెద్దలను కంటికి రెప్పలా కాపాడే డిజైన్లు - ఇవి ఉంటే చాలు!