Meeting in Guntur Jana Chaitanya Vedika : గ్రామ పంచాయతీల అధికారాలను, హక్కుల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాల రాసిందని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్వంలో జరిగిన స్థానిక సంస్థల సాధికారితపై చర్చా గోష్టి కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, సర్పంచుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. రాజ్యాంగం స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చినప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర సర్పంచులు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం సృష్టించదని ఆరోపించారు.
గ్రామ పంచాయతీల్లో మార్పే లక్ష్యం: స్థానిక సంస్థల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ చూపుతున్నారన్నారు. అందులో భాగంగానే నిధులు కేటాయిస్తూ, గ్రామసభలు నిర్వహించామన్నారు. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థల పరిపాలనకు సంబంధించిన అంశాలను పొందుపరిచారని, కానీ గత ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందకుండా ప్రజాస్వామ్యంలో రాష్ట్ర, దేశ ప్రగతి సాధ్యం కాదన్నారు. స్థానిక సంస్థల సాధికారిత చర్చా గోష్టిలో వక్తల సూచనల మేరకు గ్రామ పంచాయతీల అభివృద్ధికి పలు తీర్మానాలు చేసినట్లు సభా అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి వెల్లడించారు.
వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో మద్య నిషేధం ప్రస్తావనే లేదు: జనచైతన్య వేదిక - YSRCP Manifesto
స్థానిక ప్రభుత్వాలను వైఎస్సార్సీపీ ప్రశ్నార్థకంగా మార్చిందని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి విమర్శించారు. గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థలు కావని 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన స్థానిక ప్రభుత్వాలనే విషయం అందరూ గుర్తించాలని తులసి రెడ్డి అన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్టి కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు తిరిగి ప్రాధాన్యం ఇచ్చిన కూటమి ప్రభుత్వాన్ని తులసి రెడ్డి అభినందించారు. పంచాయతీలకు సర్పంచ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కుగా తులసి రెడ్డి పేర్కొన్నారు.
నిధులు కేటాయించి గ్రామసభలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గ్రామ సచివాలయాలను పంచాయతీల పరిధిలోకి తీసుకుని రావాలని సూచించారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యమని డొక్కా వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గించవచ్చని, పదవీ కాలపరిమితిని ఐదేళ్ల నుంచి నాలుగు సంవత్సరాలకు తగ్గించడం వల్ల పాలకుల నుంచి మెరుగైన ఫలితాలు సాధించవచ్చని డొక్కా పేర్కొన్నారు.