Mee Seva New App Launch Today : ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ఐటీ శాఖ పలు కీలక ప్రాజెక్టులు ప్రారంభించనుంది. మీ సేవ ద్వారా 150 రకాల పౌర సేవలను ప్రజలకు చేరువ చేయనుంది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ సిద్ధం చేయడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో కియోస్క్‌లు ఏర్పాటు చేస్తుంది. ఈ యాప్ ఆవిష్కరణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ అందించేందుకు ఉద్దేశించిన టీ-ఫైబర్ ప్రాజెక్టును ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రారంభించనుంది.
దీని ద్వారా ప్రభుత్వ విద్యాలయాలతో పాటు తొలి ఏడాది 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు బ్రాడ్‌బ్యాండ్ అందించనుంది. మరోవైపు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో పరిశ్రమల శాఖ 4 సంస్థలతో రూ.7,592 కోట్ల ఒప్పందాలు చేసుకోనుంది.
ఫైబర్ పైలట్ ప్రాజెక్టు కింద మూడు జిల్లాల్లోని ఒక్కో గ్రామంలో 4 వేల కుటుంబాలకు కేబుల్ టీవీ సేవలతో కూడిన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందించనుంది. పెద్దపల్లిలోని అడవి శ్రీరాంపూర్, సంగారెడ్డిలో సంగుపేట, నారాయణపేటలోని మద్దూర్‌లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడు గ్రామాల్లోని గ్రామపంచాయతీలతో పాటు అక్కడి మూడు కుటుంబాలతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. టాస్క్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు 11 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.
టీ-వర్క్స్ : జాతీయ భద్రతలో దేశం స్వావలంబన సాధించేందుకు హైదరాబాద్‌లోని బిట్స్‌పిలానీ జాతీయ భద్రతలో పరిశోధన ఎక్స్‌లెన్స్ కేంద్రం(క్రెన్స్)ను ఏర్పాటు చేసింది. బిట్స్‌పిలానీ క్రెన్స్‌తో టీ-వర్క్స్ ఒప్పందం చేసుకోనుంది.
అడెక్స్: వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వ్యవసాయ డేటా ఎక్స్ఛేంజి(అడెక్స్) పేరిట సమాచారాన్ని తీసుకొచ్చింది. దీని ఆధారంగా చిన్న, సన్నకారు రైతులకు రూ.లక్ష వరకు రుణాలు ఇచ్చేందుకు హెచ్‌డీఎఫ్‌సీ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఒప్పందం కుదరనుంది.
టీజీన్యాబ్ అప్లికేషన్: మాదకద్రవ్యాలను నివారించేందుకు విద్యార్థుల మానసిక ప్రవర్తనను మార్చేందుకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీన్యాబ్), ఐటీశాఖ సహకారంతో యునైటెడ్ వియ్ కేర్ స్టార్టప్ వాట్సప్ ఆధారిత చాట్ అప్లికేషన్ సిద్ధం చేసింది. దీన్ని హైదరాబాద్ చుట్టూ ఉన్న వెయ్యి పాఠశాలలకు అందించనుంది.
ప్రాజెక్టు సన్మతి: గ్రామీణ, అల్పాదాయ వర్గాల్లోని మహిళకు డిజిటల్‌పై అవగాహన పెంచేందుకు ప్రాజెక్టు సన్మతి ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత, జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నాయి. తొలుత మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి.
నాలుగు పరిశ్రమలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆజాద్ ఇంజినీరింగ్, ప్రీమియర్ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్, లెన్స్‌కార్ట్ సంస్థలు రూ.7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దీంతో 5,200 మందికి ఉద్యోగ అవకాశాలు అందనున్నాయి.
కొత్త సేవలు : ప్రజలు ఇంటి నుంచే పౌరసేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేకంగా ‘మీసేవ యాప్’ను ఐటీశాఖ సిద్ధం చేసింది. దీని ద్వారా 150 రకాల పౌరసేవలు అందనున్నాయి. మెట్రో స్టేషన్లు, షాపింగ్‌మాల్స్, సమీకృత కలెక్టరేట్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో ఇంటరాక్టివ్ కియోస్క్ ద్వారా ప్రజలు పౌర సేవలు పొందవచ్చు. దరఖాస్తులు, డిజిటల్ చెల్లింపులు, సర్టిఫికెట్ ప్రింట్ తీసుకునే అవకాశాలు కల్పిస్తున్నారు.
మీసేవలో ప్రభుత్వం కొత్త సర్వీసులు చేర్చింది. పర్యాటక శాఖ హోటల్స్, పర్యాటక ప్యాకేజీల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, వయోవృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ, సదరం సర్టిఫికెట్ల జారీ, అటవీశాఖకు సంబంధించి వన్యప్రాణుల బాధితులకు సహాయం, టింబర్ డిపోలు, కలపమిల్లుల పర్మిట్ల పునరుద్ధరణ, కొత్తవి జారీ, వాల్టా చట్టం కింద చెట్ల తొలగింపు, తరలించేందుకు అనుమతులు ఉన్నాయి.