Medaram Jatara 2024 Last Day : నాలుగు రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర(Medaram Jatara) చివరి అంకానికి చేరుకుంది. నేడు అమ్మల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ సాయంత్రం పూజారులు గద్దెల వద్దకు వచ్చి, సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అనంతరం వన దేవతల వన ప్రవేశం మొదలవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయ్ గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది.
ఈ క్రమంలో మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. గద్దెల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మూడు రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజైనా వచ్చి దర్శనాలు చేసుకోవాలని విచ్చేస్తున్నారు. తల్లుల వనప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాలను నిలిపివేసినా మళ్లీ యథాతథంగా దర్శనాలు జరుగుతున్నాయి. రెండేళ్లకోసారి అమ్మవార్లను దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా, దర్శనం మాత్రం బాగా జరుగుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sammakka Saralamma Jatara : మహా జాతరకు భక్తులు పోటెత్తడంతో మేడారం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్(Medaram Heavy Traffic) ఏర్పడుతోంది. తాడ్వాయి, పస్రా గుండ్లవాగు వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయి. ఎంతకీ వాహనాలు ముందుకు కదలక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ మళ్లీ యథావిథిగా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మేడారం భక్తులకు గుడ్‌న్యూస్ - అరచేతిలో 'జాతర' సమాచారం! - యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారా?
మరోవైపు మేడారం జాతర(Medaram Festival)లో కోళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. తొలి రెండు రోజులు కేజీ కోడి ధర రూ.150 విక్రయించారు. ఇలా చేయడంతో చాలా దుకాణాలలో కోళ్లు అయిపోవడం, సరఫరా లేకపోవడంతో విక్రయదారులు ధరను అమాంతం పెంచేశారు. కోడి కేజీకి రూ.500లకు విక్రయించారు. భారీగా ధర ఉండటంతో చాలా మంది చికెన్ సెంటర్ల నుంచి వెనుదిరిగిన పరిస్థితి తలెత్తింది. కొంత మంది మేకలు, గొర్రెల మాంసం కొనుగోలు చేశారు.
గుండెపోటుతో ఇద్దరు భక్తులు మృతి : సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి దర్శనానికి అని వచ్చిన ఇద్దరు భక్తులు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను పెద్దపల్లి జిల్లాకు చెందిన లక్ష్మి, విజయవాడకు చెందిన సాంబయ్యగా గుర్తించారు.
అశేష జనసందోహంతో అకట్టుకుంటున్న మేడారం డ్రోన్ దృశ్యాలు
గద్దె మీదకు చేరుకున్న సమ్మక్క- భక్తుల నామస్మరణతో మార్మోగుతున్న మేడారం