Many People Getting Ration Cards For Government Welfare Schemes : ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాలకు ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా చేసింది. వాటి ప్రయోజనం కోసమే అధిక శాతం కుటుంబాలు తెల్ల రేషన్ కార్డులను తీసుకుంటున్నాయి. రేషన్ కార్డు కావాలంటూ పెద్దఎత్తున దరఖాస్తులు రావడానికి కారణమిదే. తీరా ఇది బియ్యం నల్లబజారుకు తరలివెళ్లడానికి కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతి సంవత్సరం ఈ రేషన్ బియ్యంపై రూ.12,800 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అందులో సింహభాగం రూ.10 వేల కోట్ల బియ్యం దళారుల గోదాముల్లోకే వెళ్తున్నాయి. వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, రేషన్ మాఫియాలకు ఈ రేషన్ బియ్యం సిరులు కురిపిస్తున్నాయి. ఈ రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలుచేస్తే బియ్యం సరఫరా ఖర్చు తగ్గుతుంది. ఈ మొత్తంతో మరింత మంది ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు.
ప్రామాణికం కాదంటూనే మెలిక : రేషన్ కార్డులతో సంబంధం లేకుండా అర్హులైనా పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని ప్రభుత్వాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. అయితే అమల్లోకి వచ్చేసరికి చివరికి అదే ప్రామాణికం చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలే అర్హులను గుర్తించి పలు పథకాలు వర్తింపజేయొచ్చు. అయితే వారంత బాధ్యతలను తగ్గించుకునేందుకు, అలాగే ఏదైనా తేడా వచ్చినా తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నామని చెప్పి తప్పించునేందుకు ఇదొక మార్గంగా చూపుతున్నారు. ప్రతి శాఖలో ఎవరికివారే చివరికి రేషన్ కార్డునే ముందుకు తెస్తున్నారు.
"తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక" - వీరికి రేషన్ కార్డులు, వారి ఖాతాల్లో డబ్బులు
అడుగడుగునా అక్రమాలే : పేదలకు బియ్యం సరఫరాలో అడుగడుగునా అక్రమాలే కనిపిస్తాయి. అన్నదాతలకు మద్దతు ధర నుంచి జిల్లా, మండల స్థాయిల్లో ఉన్న గోదాములకు తరలింపు వరకు దోపిడీ కొనసాగుతోంది. చివరికి రవాణా టెండర్లలోనూ కుమ్మక్కై దోచుకుంటున్నారు. రేషన్ డీలర్‌కు 50 కిలోల బియ్యం బియ్యం బస్తా అని పంపిస్తారు. కానీ అది 45 నుంచి 48 కిలోలే ఉంటోంది. అర్హులైనా కార్డుదారులకు వచ్చిన బియ్యాన్ని కొనేందుకు మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బియ్యం మాఫియా వ్యవస్థ ఉంటోంది. వీరికి కొందరు పోలీసులు, విజిలెన్స్, రవాణా, రెవెన్యూ అధికారుల అండదండలూ ఉంటున్నాయి. వీరికి వారి స్థాయిని బట్టి ఏటా రూ.రెండున్నర లక్షల నుంచి రూ.7 లక్షల వరకు కమీషన్లు అందుతున్నాయి. ఇలా భారీ ఆదాయం ఉండబట్టే పలు జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థ అధికారుల పోస్టులకు రూ.40 లక్షల వరకు చెల్లించేందుకు అధికారులు వెనకాడటం లేదు. చాల మంది ప్రజాప్రతినిధులకు మండలానికి నెలకు రూ.5 లక్షలు, అదేవిధంగా అడ్వాన్సుగా రూ.కోటి చెల్లిస్తున్నారంటే బియ్యం అక్రమాల తారాస్థాయి ఏవిధంగా ఉందో స్పష్టమవుతోంది.
కేరళలో నాలుగు రకాల కార్డులు : కేరళ రాష్ట్రంలో ఒక కుటుంబానికి నాలుగు రకాల కార్డులిస్తున్నారు. వారి ఆదాయ ప్రాతిపదికన తెలుపు, గులాబీ, నీలి, పసుపురంగు కార్డుల ద్వారా పథకాలను వర్తింపజేస్తున్నారు. వీటి ద్వారే అర్హులైనా లబ్ధిదారులకు ప్రయోజనాలు కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా కుటుంబాల ఆదాయ ప్రాతిపదికన ఇదే విధానాన్ని అమలు చేస్తే రేషన్ బియ్యం అక్రమాలను కట్టడి చేసి, అర్హులకు సంక్షేమ పథకాలను విస్తరించే వీలుంటుంది.
ఏటా రూ.10,392 కోట్లు భారం : ఏదైనా కుటుంబానికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలంటే తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి. అందుకోసంమే అధిక శాతం కుటుంబాలు ఈ రేషన్ కార్డులను తీసుకుంటున్నాయి. అవసరం లేకున్నా ప్రతినెల బియ్యం తీసుకుని వెంటనే దళారులకు అమ్మేస్తున్నాయి. ఎందుకంటే బియ్యం తీసుకోకపోతే కార్డు రద్దవుతుందనే భయమే దీనికి ప్రధాన కారణం. నిజానికి అలాంటి కుటుంబానికి కావాల్సింది ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే ప్రయోజనం మాత్రమే. అలాంటి వారికి అవసరం లేకున్నా ఒక్కో కార్డుపై సగటున నలుగురికి బియ్యాన్ని ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ఏటా రూ.10,392 కోట్లు భారం పడుతోంది. ఆరోగ్యశ్రీ, ఉచిత బియ్యం ఈ రెండు పథకాలకూ డబ్బులు చెల్లించేది పూర్తిగా ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డు తప్పనిసరనే నిబంధన తొలగిస్తే ఉచిత బియ్యం ఖర్చు భారీగా తగ్గుతుంది. ఈ మిగులు ద్వారా రాష్ట్రంలో మరిన్ని పేదా కుటుంబాలకు ప్రయోజనం అందించవచ్చు. అంతేగాక బియ్యం దళారుల దందానూ అరికట్టవచ్చు.
కొత్త జంటలకూ రేషన్ కార్డు - కుటుంబ సభ్యుల చిత్రాలతో సరికొత్తగా!