Mango Crop Yields Fallen significantly in Nunna Mango Market : ఏటా ఈ సమయానికి మామిడి కాయల ఎగుమతుల కోసం వచ్చే వాహనాలతో కిక్కిరిసి ఉండాల్సిన ఎన్టీఆర్ జిల్లా నున్న మార్కెట్ చాలా స్తబ్ధుగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే మామిడి ఎగుమతులు తోటల నుంచి నామమాత్రంగా ప్రారంభమైనప్పటికీ నున్న మార్కెట్‌లో మాత్రం ఏప్రిల్ నెల రెండు, మూడు వారాల నుంచే సరకు ఎగుమతులు మొదలయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు, రైతుల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేసి దిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, లక్నో, కోల్‌కత్తాకు ఎగుమతి చేస్తున్నారు. నూజివీడు, విస్సన్నపేట, మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాల నుంచి నున్న మార్కెట్‌కు మామిడి పండ్లు వస్తున్నాయి. అయితే గతంతో పోల్చితే ఈసారి చాలా తక్కువ సరకు వస్తోంది. రోజుకు 400 నుంచి 500 టన్నుల వరకు ఎగుమతులు జరిగే మార్కెట్‌లో ఇప్పుడు కనీసం సగానికి సగం కూడా మామిడి వ్యాపారం సాగడం లేదు. రోజుకు 200 టన్నుల మామిడిని మాత్రమే ఎగుమతి చేస్తున్నారు.
'ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత ఆలస్యమైంది. జనవరిలో కొంత పూత వచ్చినా వైరస్ బారిన పడడంతో పిందె కట్టకుండానే రాలిపోయింది. గతంలో ఎకరానికి నాలుగు టన్నుల నుంచి ఐదు టన్నుల వరకు దిగుబడి రాగా ప్రస్తుతం సగానికిపైగా దిగుబడి తగ్గిపోయింది. అయితే ఈ ఏడాది ధరలు ఒకింత ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఊరట చెందుతున్నారు. బంగినపల్లి, రసాలు, తోతాపురి వంటి రకాలకు మంచి ధర పలుకుతోంది.' -మామిడి రైతులు
Mango Farmers: ప్రభుత్వ విధానాల శరాఘాతం.. సంక్షోభంలో మామిడి రైతు
ప్రకృతి ప్రకోపాలను తట్టుకుని పంట వేసిన మామిడి రైతులు గత ఐదేళ్లలో ప్రభుత్వం కొట్టిన దెబ్బకు విలవిల్లాడిపోతున్నారు. బీమా లేక, కవర్లపై రాయితీ రాక, గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారు. మామిడి నాణ్యతను పెంచేందుకు ఉపయోగించే ఫ్రూట్ కవర్లకు రాష్ట్ర ప్రణాళిక నుంచి నిధులివ్వకుండా వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టేసింది. చీడపీడలను నివారించే వ్యవస్థ, సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక సాగు, ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మామిడి రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నున్న మార్కెట్‌లో ముఠా కార్మికులకు చేతినిండా పనులు లేకపోవడంతో డీలా పడుతున్నారు.
కృష్ణా, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో బంగినపల్లి సాగు అధికం. ఈ రకం మామిడికి విదేశాల్లో అధిక డిమాండ్ ఉన్నా అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. కొత్తగా ప్యాకింగ్ యూనిట్ల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకొస్తున్నా సర్కార్ నుంచి మాత్రం ఏమాత్రం సహకారం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు.
రూపాయికే కిలో మామిడి పండ్లు.. సాగు రైతుల కష్టాలు.. ఎక్కడంటే?