Mangalagiri Premier League: రాబోయే ఎన్నికలను పురష్కరించుకుని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ల కోసం సమయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ఎన్నికల నగరాను ఇప్పటికే పూరించగా, తెలుగుదేశం యువనేత లోకేశ్ కూడా ఎన్నికలకు సమర శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్న ఆయన ప్రభుత్వ అరాచకాలు, అవినీతిని ఎండగడుతున్నారు.
టీడీపీ గెలుపుపై ధీమాగా ఉన్న లోకేశ్ తన నియోజకవర్గమైన మంగళగిరిలో తెలుగుదేశం మెజారిటీపై దృష్టి సారించారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరు వీధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన స్థానిక టీడీపీ నేతలు లోకేశ్ జన్మదినం సందర్భంగా ఇటీవల భారీ క్రీడా సంబరానికి తెరదీశారు. మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో భారీ స్థాయిలో క్రికెట్ పోటీలను నిర్వహించిన టీడీపీ శ్రేణులకు యువత నుంచి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గంలో నిర్వహించిన మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2లో పాల్గొన్న యువతను చూస్తుంటే, లోకేశ్‌కు నియోజకవర్గంలోని బలమెంటో తెలిసిపోతుందని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆ కసి నాలో ఉంది - రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా చేస్తా : లోకేశ్
గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 పోటీలు ఆదివారంతో ముగిశాయి. దాదాపు 100 జట్ల వరకు పోటీలో పాల్గొన్నాయి. ఈ క్రికెట్ పోటీల్లో భాగంగా ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్‌లో వల్లభనేని వెంకట్రావ్ యూత్ టీమ్‌కు, దుగ్గిరాలకు చెందిన అన్‌స్టాపబుల్ జట్లకు మధ్య పోటీ నువ్వానేనా అనే స్థాయిలో జరిగింది.
ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వల్లభనేని యూత్ జట్టుకు 2లక్షల రూపాయల నగదు బహుమతిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అందించారు. ఈ కార్యక్రమానికి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హాజరయ్యారు. రన్నరప్ జట్టుకు లక్ష రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన టీమ్‌కు 50 వేల రూపాయల బహూమతిని ప్రధానం చేశారు. ఈ పోటీలను తిలకించేందుకు స్థానిక ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు.
'జగన్ హ్యాండ్సప్, వైసీపీ ప్యాకప్' - వైరల్ అవుతున్న నారా లోకేశ్ ట్వీట్
గ్రామీణ ప్రాంతాల్లోని యువతను క్రీడలవైపు మళ్లీంచాలనే సదుద్దేశ్యంతో లోకేశ్ సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. లోకేశ్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ ఎంపీఎల్ పోటీలను మంగళగిరిలోని స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీలు ఈ నెల 9వ తేదీన ప్రారంభంమై 28వ తేదీన ముగిశాయి. ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలి రావడంతో స్థానికంగా సందడి వాతవరణం కనిపించింది.
క్రికెట్ ఆడిన లోకేశ్: ఎంపీల్లో చివరి రోజైన ఆదివారం రోజున లోకేశ్ క్రికెట్ పోటీలను తిలకించారు. అంతకముందు ఆయన క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. ఆయన ఆట ఆడుతున్న సమయంలో క్రీడాకారులు, అభిమానులు, తెలుగుదేశం నాయకులు, నేతలు, టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని అసక్తిగా తిలకించారు. వారు ఉత్సహంతో కేరింతలు కొడుతుంటే మైదాన ప్రాంగణం ఉత్సహంతో నిండిపోయింది.
నారా లోకేశ్ యువగళానికి ఏడాది పూర్తి - టీడీపీ కార్యాలయంలో వేడుకలు