Mangalagiri Area Under Surveillance of CC Cameras : రాజధాని ప్రాంతంలో కీలకమైన మంగళగిరిలో ప్రభుత్వం రియల్‌టైం గవర్నెన్స్ అమలు చేయడానికి సిద్ధమైంది. నేరాలు, అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు సత్వరం స్పందన కోసం ఆర్టీజీఎస్ (RTGS) సేవలను వినియోగించుకోనుంది. దీనికోసం నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
వైఎస్సార్సీపీ పాలనలో రాజధాని అమరావతి ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. మంగళగిరి-తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసినా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పైగా రాజధాని ప్రాంతంలో విచ్చలవిడిగా దొంగతనాలు, దోపిడీలు జరిగాయి. ఏకంగా రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చిన సామగ్రిని దుండగులు దోచుకున్నారు. రోడ్లను తవ్వి మరీ కంకర, మట్టి ఎత్తుకెళ్లారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ నివాసానికి సమీపంలోనే ఎన్నో దొంగతనాలు, హత్యచారాలు జరిగాయి. గంజాయి ముఠాలు ఆగడాలు భరించలేకపోయారు.
అమరావతి ఐకానిక్ నిర్మాణాలకు త్వరలోనే టెండర్లు - డిజైన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అమరావతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. రాజధానికి ముఖద్వారంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో శాంతిభద్రతలపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని భావిస్తోంది. పైగా మంత్రి లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించింది. దీని కోసం నియోజకవర్గంలో ఆర్టీజీఎస్ సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నారు.
ప్రముఖులు నివాసం ఉండటంతో భద్రత పెంపు : సీఎం చంద్రబాబు సహా మంత్రులు, కీలక అధికారులు మంగళగిరి నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, నేరాలు జరగకుండా చూడటం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. మంగళగిరిలోని అన్ని ప్రధాన మార్గాలు, కూడళ్లలో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 300 సీసీ కెమెరాలు ఉండగా వాటిల్లో చాలావరకు పనిచేయడం లేదు. వీటిని సరిచేయడంతోపాటు అదనంగా మరో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్ - ఏపీని డ్రోన్స్ క్యాపిటల్‌గా మార్చాలని నిర్ణయం!
ఆర్టీజీఎస్ సేవలు : మంగళగిరితోపాటు తాడేపల్లి, పెదకాకాని, దుగ్గిరాల పోలీస్‌స్టేషన్ల పరిధిలో సమగ్రంగా నిఘా పెట్టేందుకు ఆర్టీజీఎస్ సహకారం తీసుకోనున్నారు. జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలు, ప్రజాప్రతినిధుల నివసించే ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ గుర్తింపు కెమెరాలు, రహదారులపై ప్రమాదాలకు పాల్పడి తప్పించుకుని వెళ్లేవారి వాహనాల నంబర్లను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.
మంగళగిరి ఎయిమ్స్‌లో మెరుగైన వైద్య సేవలు - అతి తక్కువ ఖర్చుతో చికిత్స - Mangalagiri AIIMS
జాతీయ రహదారిపైనా పెద్దఎత్తున నిఘా : నేరాలకు పాల్పడిన వారిని సత్వరం పట్టుకునేందుకు కెమెరాల ఏర్పాటు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వీటిని కంట్రోల్‌రూంతో పాటు పోలీసు అధికారుల సెల్‌ఫోన్లకు కూడా అనుసంధానిస్తారు. వీరు ఫోన్ల నుంచే కెమెరాలను అటు ఇటు తిప్పపడంతోపాటు జూమ్ చేసి చూసే అవకాశం కూడా ఉంది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నా నిందితులు చిక్కడం లేదు. కొన్ని ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో వీటన్నింటినీ అరికట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు.