Lokesh Wife Nara Brahmani Meet with Women Workers: రాష్ట్రంలో ఉపాధి దొరక్క మహిళా కూలీలు ఇబ్బందులు పడుతున్నారని నారా బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. వారితో కలిసి పూలు కోశారు. మహిళా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని మహిళా కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. పరిశ్రమలు లేక పిల్లలకు ఉపాధి లభించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని గెలిపిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బ్రాహ్మణి భరోసా ఇచ్చారు.
వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరవైంది - కూటమి పార్టీల మహిళా నేతలు - NDA Women Leaders fires on ysrcp
రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని నారా బ్రాహ్మణి అన్నారు. మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు, లోకేశ్ నిరంతరం పరితపిస్తారని పేర్కొన్నారు. మహిళలు, చేనేత కార్మికులు, రైతు కూలీలతో ముచ్చటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలను ఆమె ప్రజలకు వివరిస్తున్నారు. మంగళగిరి రూపురేఖలు మారాలన్నా ఏపీ అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆమె అన్నారు. మహిళలు మంగళహారతులు పడుతూ ఆమెకు స్వాగతం పలుకుతున్నారు.
రాజధాని కోసం రైతులు భూములను ఇవ్వడం జరిగింది. మహిళలు, వృద్ధులు చాలా కష్టపడుతున్నారు. వారికి రేషన్ కార్డులు లేక బియ్యం రావట్లేదు. ఇండస్ట్రీలు ఏమీ రాక పిల్లలకు ఉపాధి అవకాశలు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ల భూములన్నీ రాజధాని కోసం ఇస్తే ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. -నారా బ్రహ్మణి
చంద్రబాబు అధికారంలోకి రాగానే మహిళల సమస్యలు పరిష్కరిస్తాం: నారా బ్రాహ్మణి
గతంలో అన్నా క్యాంటీన్ ద్వారా రూ.5తో మా ఆకలి తీరేదని దానిని జగన్ ప్రభుత్వం వచ్చాక ఎత్తేసి మా పొట్టగొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా నిత్యావసరాల ధరలు, విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయి. చాలీచాలని ఆదాయంతో ఇంటిల్లిపాది పని చేసినా ఇల్లు గడవడం కష్టంగా ఉందని మహిళలు వివరించారు. గతంలో రాజధాని పనులు జరిగే సమయంలో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేది.
వైసీపీ వచ్చాక రాజధాని పనులు నిలిపివేయడం, కౌలు కూడా ఇవ్వకపోవడంతో రైతులు సైతం కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని బ్రాహ్మణి ఎదుట మహిళా కూలీలు వాపోయారు. మీ అందరికీ అండగా నిలిచేందుకే చంద్రబాబు సూపర్-6 పథకాలను ప్రకటించారని బ్రాహ్మణి తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి పేదల ఆకలి తీరుస్తామన్నారు. లోకేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు.