LHMS AP Police App Uses in Telugu : ఇటీవల కాలంలో ఇంటి దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఊరికి వెళ్లాలన్నా దొంగల బెడదతో ఆగిపోతున్నారు. గుర్తుపట్టుకూడదని మహిళల వేషంలో, మాస్కులు ధరించి దోపిడీలకు పాల్పడుతున్నారు. దొంగతనం అంతా అయ్యాకా ఎంత సీసీ కెమెరాలు చూసినా కొన్ని సార్లు దొంగలను కనిపెట్టలేకపోతున్నారు. ఇలా దొంగతనాలను అరికట్టేందుకు ఏపీ పోలీసుశాఖ 2017లో ఎంతో ప్రతిష్టాత్మకంగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
సాంకేతికతలో నేరాలు అదుపు చేసేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుంది. కానీ ప్రజల్లో దీని పట్ల అవగాహన లేకపోవడంతో దీన్ని ప్రారంభించి ఎనమిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ తక్కువ మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు కావడంతో ఎల్‌హెచ్‌ఎంఎస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. ఈ యాప్ వాడటం వల్ల దొంగతనాలను అరికట్టొచ్చు అంటున్నారు పోలీసులు.
ఎలా వాడాలి అంటే :
- గూగుల్ స్టోర్ నుంచి ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి.
- ఫోన్ నంబరు, చిరునామాతో నమోదు చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తవగానే వచ్చే ఐడీ భద్రపరుచుకోవాలి.
- ఊరు వెళ్లాల్సిన సందర్భంలో యాప్‌లోకి వెళ్లి యూజర్ ఐడీ నమోదు చేసి వెళ్లే, తిరిగి వచ్చే సమయాలను టైప్ చేయాలి.
- అనంతరం రిక్వెస్ట్ పోలీసు వాచ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
ఫొటోలు తీసి పోలీసులకు అలర్ట్ చేస్తుంది : వినియోగదారుడు ఇచ్చిన సమాచారంతో కంట్రోల్ రూం పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో వచ్చిన చిరునామాలో వైఫై రూటర్, సెన్సార్‌తో పనిచేసే మోషన్ కెమెరాలు, విద్యుత్తు పోయినా పనిచేసేలా యూపీఎస్ ఏర్పాటుచేసి, కంట్రోల్ రూమ్‌కి అనుసంధానిస్తారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి అపరిచితులు ప్రవేశించడానికి ప్రయత్నిస్తే సెన్సార్ ద్వారా ఫోటోలు తీయడంతో పాటు అలారం ద్వారా కంట్రోల్ రూం, స్థానిక పోలీసులను అప్రమత్తం చేస్తుంది. నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడకు చేరుకుని దొంగలను పట్టుకునే అవకాశముంటుంది. కాగా ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై జిల్లా ప్రజలకు పోలీసు యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
Women Safety Tips Telugu : అమ్మాయిలపై 'ప్రేమ' దాడులు.. అమ్మానాన్న ఎలా కాపాడుకోవాలంటే..?