Leopard Active in Kadiyam Nurseries of East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం స్థానిక ప్రజలకు కొన్నిరోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీశాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిరుతను బంధించలేక పోతున్నారు. ప్రతిసారి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. తాాజాగా మరోసారి రూటు మార్చి కడియం నర్సరీలో పాగా వేసింది. ఆ చిరుతను బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నర్సరీలో 20 పైగా ట్రాప్ కెమెరాలు, 10 సీసీ కెమెరాలు, 2 బోన్లు అమర్చి చిరుత జాడను కనిపెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
తీవ్రంగా శ్రమిస్తున్న అధికారులు : తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల నుంచి 60 మంది సిబ్బంది చిరుత జాడ కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత మంగళవారం రాత్రి కడియపులంక నర్సరీలో రోడ్డు దాటుతూ చిరుత రైతు కంటపడింది. అప్పటివరకు దివాన్ చెరువు అభయారణ్యంలో ఉన్న చిరుత ఒక్కసారిగా ఈ ప్రాంతానికి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కడియం నర్సరీలో పనిచేస్తున్న 30 వేల మంది పైగా కూలీలు, నర్సరీల నిర్వహకులతోపాటు స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
రూటు మార్చిన చిరుత - అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి సంచారం - Leopard at Diwancheruvu Forest
స్థానికులు అప్రమత్తంగా ఉండాలి : ఎలాగైనా చిరుతను బంధించేందుకు తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల డీఎఫ్‌వో(DFO)లు ఎస్ భరణి, ప్రసాద్ రావుల ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చిరుత సంచరించిన కడియపులంక, బుర్రిలంక ప్రాంతాల్లో పాదముద్రలు సేకరించారు. ప్రస్తుతం అది కడియపులంక పరిసరాల్లోనే ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. చిరుత కనిపిస్తే ఎలాగైనా మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు. మండలంలో చిరుత పులి సంచరిస్తున్నందువల్ల జనం మాత్రం పూర్తి జాగ్రత్తలు పాటించాలని అటవీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
"ప్రస్తుతం చిరుత కడియం నర్సరీల్లో సంచరిస్తున్నట్లు అడుగు జాడలను బట్టి తెలుస్తోంది. దాని కదలికలను స్పష్టంగా గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు, ట్రాప్ కేజెస్లను ఏర్పాటు చేస్తున్నాం. అటవీ శాఖ సిబ్బంది కడియపులంక పరిసర ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. చిరుత ట్రాప్ కేజెస్‌లో పడితే ఆటోమెటిక్‌గా బంధిస్తుంది. లేకపోతే చిరుత కనిపిస్తే ఎలాగైనా మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకునేేందుకు ప్రయత్నిస్తాం. నర్సరీలో 20 పైగా ట్రాప్ కెమెరాలు, 10 సీసీ కెమెరాలు, 2 బోన్లు ఏర్పాటు చేశాం. అలాగే వివిధ జిల్లాల నుంచి 60 మంది సిబ్బంది చిరుత జాడ కోసం విధులు నిర్వర్తిస్తున్నారు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం 5 గంటల తరువాత ఎవరి ఇళ్లలోకి వారు వెళ్లిపోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలను బయటకు పంపవద్దు. ఒకవేళ అత్యవసరం మీద బయటకు వెళ్లవలసి వస్తే గుంపులుగా వెళ్లాలి. అప్పుడు కూడా చేతిలో కర్ర, టార్చ్ లైట్ పెట్టుకొని వెళ్లాలి." - ప్రసాదరావు , కోనసీమ డీఎఫ్‌వో