Muppalla Subbarao on Subramanyam Murder Case : దళిత యువకుడు, డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ప్రభుత్వాన్ని కోరారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
MLC Ananta Babu Driver Murder Case Updates : మృతుడు సుబ్రహ్మణ్యం ఒంటి నిండా గాయాలున్నా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారని ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు. ఘటన జరిగిన సమయంలో అనంతబాబు గన్‌మెన్ ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు. ఈ హత్య కేసులో చాలా మందికి ప్రమేయం ఉందని చెప్పారు. కానీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒకరి మీదే కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇందుకు సహకరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ముప్పాళ్ల సుబ్బారావు ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయించి నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ను రద్దు చేయించాలని ముప్పాళ్ల సుబ్బారావు సూచించారు. మరోవైపు మృతుడి కుటుంబానికి అందాల్సిన లబ్ధిని గత సర్కార్ నిలిపివేసిందని గుర్తు చేశారు. తిరిగి వాటిని అందజేయాలని ప్రభుత్వాన్ని ముప్పాళ్ల సుబ్బారావు కోరారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ఎమ్మెల్సీ అనంతబాబు తమ కుమారుడిని దారుణంగా చంపారని మృతుడి తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నం ఆరోపించారు. కానీ పోలీసులు ఈ కేసును నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అనంతబాబుకు శిక్ష పడే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏ రకమైనా సహాయం అందలేదని చెప్పారు. కనీసం కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని వారు చెప్పారు.
"సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి విచారించాలి. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్యం హత్య జరిగిన సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు గన్‌మెన్ ఎక్కడికి వెళ్లాడు. ఈ కేసులో ఇంకా చాలా మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ అడుగుజాడల్లో నడిచిన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి." - ముప్పాళ్ల సుబ్బారావు, న్యాయవాది