Liquor Shop Tenders : రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలు కానుండగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఈ ఒక్కరోజే అవకాశం ఉంది. గురువారం రాత్రి 8 గంటల వరకు 65,629 దరఖాస్తులు అందాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 7,920 దరఖాస్తులు రాగా, నాన్ రిఫండబుల్ రూపంలో ప్రభుత్వానికి రూ.1,312.58 కోట్ల ఆదాయం సమకూరింది.
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం గురువారం రాత్రి 8 గంటల వరకూ 65,629 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం తుది గడువు కావటంతో 20 వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం దరఖాస్తుల సంఖ్య 80 వేలు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు.
చంద్రబాబు వద్దన్నా.. మారని కొందరి నేతల తీరు
మద్యం దుకాణాల వ్యవహారంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టంగా ఆదేశించినా పలు చోట్ల పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుపడటం, నియంత్రించటం, బెదిరించటం వంటివి చేస్తే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయన అంత స్పష్టంగా తన వైఖరి తెలియజేసినా, ప్రభుత్వం ఎంత గట్టిగా వ్యవహరిస్తున్నా కొన్ని నియోజకవర్గాల్లో నేతలు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 దుకాణాలకు ఒక్కో దరఖాస్తు మాత్రమే రాగా 46 దుకాణాలకు రెండు, 57 దుకాణాలకు మూడు, 79చోట్ల నాలుగు, 115 దుకాణాలకు ఐదు చొప్పున దరఖాస్తులు పడటమే పరిస్థితిని చాటుతోంది.
- రాష్ట్ర వ్యాప్తంగా 46 దుకాణాలకు రెండేసి దరఖాస్తులు రాగా అందులో 21 దుకాణాలు తాడిపత్రి నియోజకవర్గంలోనివే కావడం గమనార్హం. ఇక తిరుపతి జిల్లాలో 12 దుకాణాలకు రెండేసి టెండర్లు మాత్రమే పడగా వాటిలో 4 చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోని ఎక్కువ దుకాణాలకు 3నుంచి 4 లోపే టెండర్లు వచ్చాయి. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలోని 56 నుంచి 61వ నంబరు వరకూ మద్యం దుకాణాలకు మూడు చొప్పున దరఖాస్తులు అందాయి.
- వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు, పెండ్లిమర్రి, కమలాపురం గ్రామీణ మండలాల్లోని మద్యం దుకాణాలకు రెండు చొప్పున దరఖాస్తులు వచ్చాయి.
- అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలోని 100, 101, 102 నంబరు దుకాణాలకు ఇద్దరు మాత్రమే టెండర్లు వేశారు.
- రాప్తాడు నియోజకవర్గంలోని సీకేపల్లి, కనగానపల్లి మండలాల్లోని మద్యం దుకాణాలకు ముగ్గురు, హిందుపూరం మున్సిపాలిటీలోని పలు దుకాణాలకు ముగ్గురు చొప్పున దరఖాస్తు చేశారు.
- ఎన్టీఆర్ జిల్లాలోని గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లోని అనేక మద్యం దుకాణాలకు నాలుగు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
ఒక్క దరఖాస్తే వచ్చిన దుకాణాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని 8, 9 నంబర్ల దుకాణాలకు కేవలం ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేశారు. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 80, 81 దుకాణాలు, అమరాపురంలోని 84వ దుకాణానికి ఒక్కో టెండర్ మాత్రమే వచ్చింది. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రిలో 26, 28 నంబరు దుకాణాల, అనంతపురం జిల్లా పామిడిలోని 66, పల్నాడు జిల్లా వెల్దుర్తిలోని 98వ నంబరు దుకాణాలకు ఒకటికి మించి టెండర్ పడలేదు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఏకంగా నాలుగు (175, 182, 183, 187) దుకాణాలకు ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేయడం గమనార్హం.
మద్యం టెండర్లలో జోక్యం సహించేది లేదు - కక్షలు తీర్చుకునే స్వభావం నాది కాదు : సీఎం చంద్రబాబు
మద్యం దుకాణాల కేటాయింపులో సిండికేట్లకు సహకరిస్తే కఠిన చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర
అక్కడ లిక్కర్ లెక్కే వేరు - నూతన మద్యం షాపులకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు