Landslides On Tirumala Ghat Road Due To Heavy Rains : వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తిరుపతిలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని వెస్ట్‌చర్చి వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద నీరు ప్రవహిస్తోంది. కపిల తీర్థంలోని మాల్వాడి గుండం నుంచి వరద తిరుపతి నగరంలోకి చేరుతోంది. గొల్లవానిగుంట, పూలవాని గుంట, సంజయ్‌నగర్ కాలనీ, సుబ్బారెడ్డి నగర్, ఆటోనగర్ ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. తిరుపతి నగరంతోపాటు జిల్లాలోని స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామని అధికారులు తెలిపారు. దొరవారిసత్రం మండలంలో 11.2 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. ఏర్పేడు మండలంలోని గుడిమల్లం వద్ద విద్యుత్ స్తంభం కూలింది.
Indigo Flight Diverted Due to Water on Renigunta Runway : తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రేణిగుంట విమానాశ్రయంలో రన్‌వేపైకి నీరు చేరింది. దీంతో ల్యాండింగ్ సమస్య తలెత్తి ఇండిగో విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారు. ఈ విమానం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు రావాల్సి ఉంది.
రేణిగుంట-మామండూరు మార్గంలో కూలిన భారీ వృక్షం కూలిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎల్లమంద్యంలోని ముంపు ప్రాంతాల 15 కుటుంబాలను ఎంపీపీ పాఠశాలకు తరలించారు. తిరుపతి అర్బన్ పరిధిలో 17 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. గొల్లవానిగుంట, కొరమేనుగుంట, స్కావెంజర్స్ కాలనీ ప్రజలను తరలించే చర్యలు చేపట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు.
భారీ వర్షాలపై సీఎం సమీక్ష - ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : చంద్రబాబు
వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. జేసీబీల ద్వారా సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా తితిదే ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను తితిదే అనుమతించడం లేదు. ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేశారు. వర్షాల కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల గిరుల్లో వర్షాలతో మాల్వాడిగుండం భారీగా ప్రవహిస్తోంది. కొండల నుంచి వస్తున్న నీటితో తిరుపతి కాలనీల్లోకి వరద వచ్చి చేరుతోంది. రాజీవ్‌గాంధీ కాలనీ, ఆటోనగర్, కొరమీనుగుంటలో వరద వస్తోంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం వద్ద సీత కాల్వ కాజ్‌వేపై వరద ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. గూడూరు సబ్‌కలెక్టరేట్‌లో ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లోని తీరప్రాంతాల్లో, వాకాడు, తడ, కోట, సూళ్లూరుపేట, చిల్లకూరులో వర్షం కురుస్తోంది.
ప్రకాశం జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు - మరికొద్ది గంటల్లో వాయుగుండం!