Lakshmi Sai Charitha of Anantapur Has Mesmerizing Traditional Voice Drags All Attention : చదువుకుంటూనే అభిరుచుల వైపు అడుగేస్తున్నారు నేటితరం. ముఖ్యంగా సంప్రదాయ కళల్లో ప్రావీణ్యం కోసం చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్నతనం నుంచే ఆ దిశగా అడుగేసిందా అమ్మాయి. సమయం దొరికినప్పుడల్లా సరిగమలు సాధన చేసింది. మధురగాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. సంప్రదాయ గానంతో అకట్టుకుంటున్న యువ గాయకురాలు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రతిఒక్కరిలో ఒక సింగర్ ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని కూనిరాగాలు తీస్తుంటారు. స్నేహితులతో బయటికి వెళ్లినప్పుడు సరదాగా బయట పాడుతుంటారు. కానీ, చిన్నప్పటి నుంచి గాయకురాలు కావాలని నిశ్చయించుకుందీ అమ్మాయి. తల్లిదండ్రులు సైతం సంగీత విద్యాంసులు కావడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఫలితంగా టీటీడీ, ఈటీవీ నిర్వహించే పాటల పోటీల్లో పాడే ఆవకాశం దక్కించుకుంది.
తన పేరు లక్ష్మీసాయిచరిత. అనంతపురంలోని సోమనాథ్‌నగర్‌కు చెందిన ఎంవీఎస్. ప్రసాద్, దీప పరిమళ దంపతుల కుమార్తె. తల్లిదండ్రులిద్దరూ సంగీతం విద్వాంసులు కావడంతో చిన్నప్పటి నుంచి సరిగమలు వింటూ పెరిగింది. క్రమంగా సంగీతంపై మక్కువ పెంచుకుంది. అలా కూనిరాగాలు తీస్తున్న కుమార్తెను సంగీతం వైపు నడిపించారు తల్లిదండ్రులు. ప్రముఖ సంగీత విద్వాంసులు వీరాస్వామి దగ్గర శిక్షణ ఇప్పించారు.
4వ తరగతిలోనే సంప్రదాయ సంగీతంలోకి అడుగుపెట్టింది సాయిచరిత. అనతికాలంలోనే సరిగమలు నేర్చుకుని వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. టీటీడీ నిర్వహించిన అదిగో అల్లదిగో కార్యక్రమంలో అద్భుతంగా పాడి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈటీవీ నిర్వహిస్తున్న 2025 పాడుతా తీయగా కాంపిటీషన్‌కి ఎంపికైంది.
పాటలు పాడటమే కాదు వీణ వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించింది సాయిచరిత. పలు కార్యక్రమాల్లో వినసొంపైన వీణ వాయిద్యంలో సంగీత ప్రియుల మెప్పు పొందింది. వీణ వాయిద్యం, గానంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో దాదాపు 100కు పైగా ప్రదర్శనలిచ్చి అవార్డులు, ప్రశంసపత్రాలు అందుకుందీ గాయకురాలు.
కష్టపడింది - కల నెరవేర్చుకుంది - గీతా భార్గవి విజయగాథ ఇది
సంగీతంతో పాటు చదువులోనూ మేటిగా నిలుస్తోంది సాయిచరిత. పదో తరగతిలో 10/10 జీపీఏ తెచ్చుకుంది. ఇంటర్‌లో 95% మార్కులతో శభాష్ అనిపించింది. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది.
'సంగీతంలో డిప్లమా కోర్సు సైతం పూర్తి చేశాను. అన్నమయ్య పాటలు, ఆధ్యాత్మిక గీతాలు ఆలపించే అవకాశం దక్కింది. మల్టీనేషనల్ ఐటీ కంపెనీలు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో సంప్రదాయం సంగీతంలో అందరి దృష్టిని ఆకర్షించగలిగాను. సంప్రదాయ కళలతో పాటు అభిరుచులను అలవరచుకుంటే చదువులోనూ రాణిస్తున్నాను.' -లక్ష్మీ సాయిచరిత, సంగీత కళాకారిణి
'కుమార్తె ఆసక్తి గుర్తించి సంగీతం వైపు ప్రోత్సహించాం. కుటుంబమంతా సంగీతం వచ్చిన వారే కావడంతో ఈ సంప్రదాయాన్ని తను అందిపుచ్చుకుంది. పిల్లలకు స్వేచ్ఛనిచ్చి అభిరుచుల వైపు నడిపించాలి. ' -సాయిచరిత తల్లిదండ్రులు
యువత పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడుతున్న ఈ రోజుల్లో సంప్రదాయం సంగీతం వైపే అడుగేసింది సాయిచరిత. చదువు, సంగీతం సమన్వయం చేసుకుంటోంది. బీటెక్ అనంతరం గేట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించడంతోపాటు సినిమాల్లో పాట పాడటమే తన లక్ష్యమంటోందీ మల్టీ టాలెంటెడ్ గర్ల్.