Kurnool Municipal Corporation Officials Corruption During YSRCP Regime : రోడ్లు వేయించేశాం. కాలువలు తవ్వించేశాం. మరుగుదొడ్లూ నిర్మించేశాం. అంతేకాదు. ఇలాంటివి 89 రకాల పనులు చేసేశామంటూ గొప్పగా చెప్పారు. అయితే ఇవన్నీ కాగితాల్లోనే కనిపిస్తాయి. క్షేత్రస్థాయిలో చూస్తే ఒక్క పనీ పూర్తి చేయలేదు. కానీ బిల్లులు పెట్టి ఏకంగా 7 కోట్ల రూపాయలు కాజేశారు. ఇదీ కర్నూలు నగరపాలక సంస్థ అధికారుల అవినీతి బాగోతం. అసలు నిధులను ఎలా పక్కదారి పట్టించారు? ఇందులో ఎవరి పాత్ర ఎంత అనేదానిపై పరిశోధనాత్మక కథనం.
వైఎస్సార్సీపీ పాలనలో ఆ పార్టీ నేతలే కాదు, కొందరు అధికారులు సైతం అనేక అక్రమాలకు పాల్పడి జనాన్ని దోచుకున్నారు. ప్రజలు కట్టిన పన్నులతో మౌలిక వసతులు కల్పించకుండా నిధులను దారి మళ్లించారు. కర్నూలు నగరపాలక సంస్థలో జరిగిన అవకతవకలే ఇందుకు నిదర్శనం. అప్పటి అధికారులు, ఓ వర్క్ ఇన్‌స్పెక్టర్ చేసిన అక్రమాలను ఈటీవీ-భారత్ బయటపెట్టింది.
నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలోని ఓ అధికారి నిర్వాకాన్ని స్థానికులు వివరిస్తున్నారు. పనులు పర్యవేక్షించాల్సిన వర్క్ ఇన్‌స్పెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఏఈ (AE) నుంచి ఈఈ (EE) వరకు ఆయన చెప్పినట్లుగా సంతకాలు చేశారు. అసలు పనులు జరిగాయా నాణ్యత ప్రమాణాలు పాటించారా? అనే విషయాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అర్ధరాత్రి నిద్రలేపి సంతకం చేయమన్నారు : బాలినేని
మరగుదొడ్ల సముదాయం అని కట్టారు. నాసిరకం పనులు, కనీసం సెప్టిక్ ట్యాంక్ కూడా కట్టించలేదు. దాన్ని పట్టించుకున్న వాళ్లే లేరు. దుర్వాసన వల్ల మేము చాలా ఇబ్బందులు పడతాం. రోడ్లు వేశామని సగం సగం చేశారు. కోట్లలో నిధులు మంజూరు అయ్యాయి కానీ పరిస్థితులు చూస్తే అంత అభివృద్ధేమీ జరగలేదు.' -స్థానికులు
ఇలా ఒక్కటేమిటి ఎన్నో అక్రమాలు, ఆఖరికి హెడ్ వాటర్ వర్క్స్‌లో, నీటి ట్యాంకర్లు సరఫరా చేసే క్రమంలో ఎక్కువ ట్యాంకర్లు పంపినట్లు చూపి బిల్లులు చేసుకున్నారు. అధికారుల అవినీతిని కర్నూలు నగరపాలక సంస్థ కమీషనర్ దృష్టికి ఈటీవీ-భారత్ తీసుకువెళ్లింది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలిచ్చామని విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు.
తప్పు చేసి 'సారీ' అంటే ఊరుకుంటామా? - ఏ ఒక్కరినీ వదిలేదిలేదు : లోకేశ్