KTR Wrote Letter to CM on Viral Fevers : ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు హయాంలో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర యంత్రాంగం అంతా ప్రజారోగ్య వ్యవస్థను గాలికొదిలేయడంతో జనం విషజ్వరాలతో మంచం పట్టే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
గత ఎనిమిది నెలలుగా పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా దిగజారిపోయిందని, ఫలితంగా తీవ్రమైన దోమల బెడద కారణంగా డెంగీ, మలేరియాతో పాటు చికెన్ గున్యా లాంటి జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలానికి ముందే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఏడాదిలో దాదాపుగా 5,700 డెంగీ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. కానీ అనధికారికంగా దీనికి పది రెట్లు ఎక్కువగా ఈ సంఖ్య ఉంటుందని తెలిపారు.
డెంగీకి సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల ఒక్క డెంగీతోనే ఇటీవల దాదాపు 50 మంది చనిపోయారని కేటీఆర్ బాధపడ్డారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉండటం అత్యంత బాధాకరమైన విషయం అని అన్నారు. రెండు రోజుల క్రితం డెంగీతో ఒక్కరోజే ఐదుగురు చనిపోయిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసిందని ఆవేదన చెందారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం, సరిపడా మందులు కూడా లేని కారణంగా జనం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు.
రాజకీయ యాత్రలు ఏంటి ? : జనాల పరిస్థితులను పట్టించుకోవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు దిల్లీకి రాజకీయ యాత్రలు చేయడం దారుణమని కేటీఆర్ లేఖలో దుయ్యబట్టారు. ప్రజారోగ్యంపై సీఎం స్థాయిలో నిరంతరం సమీక్షలు జరగని కారణంగానే వైద్యారోగ్య శాఖ ఈ స్థాయిలో విఫలమైందని స్పష్టం చేశారు. కనీసం దోమల నివారణ మందులు కొట్టేందుకు కూడా పైసలు ఇవ్వకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో ప్రజారోగ్యం పతనావస్థకు చేరుకుందని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం ఇకనైనా రాజకీయాలు మాని రాష్ట్రంలో డెంగీ, మలేరియా, ఇతర విషజ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు.
KTR on ORR Lease Issue : ఓఆర్ఆర్ లీజు విషయంలో కాంగ్రెస్ మంత్రులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు ఆరోపణలు చేస్తుండటం చూస్తుంటే జాలేస్తోందని కేటీఆర్ అన్నారు. ఓఆర్ఆర్ లీజును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టమొచ్చిన ధరకు ఓ సంస్థకు అప్పగించిందని రెవెన్యూ శాఖ మంత్రి ఆరోపిస్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ తక్కువ ధరకు లీజుకు ఇస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆరోపణలు నిజమైతే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ లీజును రద్దు చేయాలని సవాల్ విసిరారు. టీఓటీ(టోల్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) లీజును రద్దు చేసి తాజాగా కొత్త బిడ్లను పిలవాలన్నారు. ఓఆర్ఆర్ లీజు విషయంలో తాము ఎన్హెచ్ఏఐ నిబంధనలు అనుసరించామని తప్పు జరిగే చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. కానీ బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తే అది ఎంతో కాలం సాగదని ఆరోపించారు.