KTR on Singareni Profits : కేసీఆర్ హయాంలో సింగరేణి ఎన్నో విజయాలు సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. 1998 నుంచి 1999లో సింగరేణి లాభాల్లో కార్మికులకు 10 శాతం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో కార్మికులకు 20 శాతం మించి లాభాలు ఇవ్వలేదని దుయ్యబట్టారు. 2014 - 15లో లాభాల్లో సుమారు రూ.103 కోట్లు కార్మికులకు ఇచ్చారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదే రూ.1,060 కోట్లకు పైగా లాభాలు తెచ్చినట్లు పేర్కొన్నారు.
2018-19లో సింగరేణి రికార్డు స్థాయిలో లాభాలు సాధించిందని కేటీఆర్ తెలిపారు. 2018-19లో ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.లక్ష లాభం ఇచ్చామన్నారు. 2023లో ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1.60 లక్షల లాభం ఇచ్చామని, సింగరేణి కార్మికులకు ఇటీవల కాంగ్రెస్ ప్రకటించింది బోనస్ కాదు, బోగస్ అని మండిపడ్డారు. సింగరేణికి ఈ ఏడాది రూ.4,701 కోట్ల లాభాలు వచ్చాయని భట్టి చెప్పారని, రూ.4,701 కోట్లలో 33 శాతం కార్మికులకు ఇచ్చామన్నారని, 33 శాతం అంటే రూ.1,551 కోట్లు కార్మికులకు రావాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ లెక్కన ఒక్కో కార్మికుడికి ఇస్తే రూ.3.70 లక్షలు అందాలని, కానీ ప్రస్తుతం సింగరేణిలో ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలే బోనస్ ప్రకటించారన్నారు. ప్రభుత్వం 16.02 శాతం ఇచ్చి, 33 శాతం ఇచ్చామని చెబుతోందని మండిపడ్డారు.
సవాల్‌కు సిద్ధమా : మరోవైపు అమృత్ టెండర్ల అవినీతిలో సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాల్సి ఉంటుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. అమృత్ టెండర్ల అంశంపై చిత్తశుద్ధి ఉంటే సీజే దగ్గరకు వెళ్దామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సీజే ముందు అన్ని దస్త్రాలు ఉంచుదామని, అవినీతి జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. తేదీ, సమయం చెబితే దిల్లీలో సీవీసీ వద్దకు తాను వస్తానని, అమృత్ టెండర్లకు సంబంధించిన దస్త్రాలు తీసుకొని సంబంధిత అధికారులను రమ్మనాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులు వచ్చినా, రాకున్నా సీవీసీకి తాను కచ్చితంగా ఫిర్యాదు ఇస్తానని వెల్లడించారు. సీఎం, మంత్రి పొంగులేటి హైకోర్టు సీజే దగ్గరికి వస్తారో, సీవీసీ దగ్గరికి వస్తారో తేల్చుకోవాలని పేర్కొన్నారు.
"సింగరేణి కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది దసరా బోనస్ కాదు, బోగస్. కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటోంది. ఒక్కో కార్మికుడికి సంస్థ లాభం రూ.4,701 కోట్లలో 33 శాతం ఇస్తే రూ.3.70 లక్షలు అందాలి". - కేటీఆర్, బీఆర్ఎస్ నేత
ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న : కేటీఆర్ - KTR Fires On Tummala