KTR Argument with ED Officials as Sister Kavitha Arrest : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టు (Kavitha Arrest)ను న్యాయపరంగా ఎదుర్కొంటామని, కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అంతకు ముందు కవిత అరెస్టుపై ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఈడీకి సహకరిస్తామని కవిత కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ నేతలు చెప్పారు.
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారులను బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయబోమని కోర్టులో చెప్పి ఎలా అరెస్టు చేస్తారంటూ మండిపడ్డారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన మాటను ఈడీ ఎలా తప్పుతుందని అన్నారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. కావాలనే శుక్రవారం వచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. సోదాల తర్వాత కూడా ఇంట్లోకి రావద్దన్న అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌తో పాటు హరీశ్ రావు కూడా ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ ఈడీ అధికారులకు, కేటీఆర్‌కు మధ్య తీవ్రంగానే వాదోపవాదాలు జరిగాయి.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ - కాసేపట్లో దిల్లీకి తరలింపు
ముందే టికెట్ బుక్ చేసి సోదాలు : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భయపెట్టేందుకే కవిత అరెస్ట్ అని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పిట్ట బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కవితను రాత్రి 8.45 గంటలకు విమానంలో దిల్లీకి తీసుకెళ్తామన్నారని, ప్రణాళిక ప్రకారమే ఆమెను అరెస్టు చేశారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, కవిత కోసం విమానం టికెట్ బుక్ చేసి మరీ సోదాలకు వచ్చారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే మహిళల అరెస్టు అంశంపై సుప్రీంలో కేసు నడుస్తోందని, సుప్రీం సూచనలనూ పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. ఈ నెల 19న సుప్రీంలో విచారణ ఉండగానే అరెస్టు సరికాదన్నారు.
MLC Kavitha Arrest in Delhi Liquor Scam Case : కవిత అరెస్ట్‌పై స్పందించిన బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, ఎన్నికల ముందు అరెస్టులేంటని ఆయన ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. అరెస్టు గల కారణాలను అడిగితే ఈడీ అధికారులు కోర్టులో తేల్చుకోవాలని చెబుతున్నారని చెప్పారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆమె ఇంటి వద్దకు చేరుకుని నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ ఎత్తున చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు, శ్రేణులు కవిత అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. కవిత నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.
దిల్లీ మద్యం కుంభకోణం కేసు - బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు