Ugadi Festival Celebrations in AP: రాష్ట్రవ్యాప్తంగా తెలుగువారి తొలి పండుగ ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. షడ్రుచులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
క్రోధి నామ ఉగాది సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవార్ల ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తణుకులో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి ఉగాది సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉగాది సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
సర్వాలంకార భూషితురాలైన అమ్మవారిని ఉగాది రోజు దర్శించుకుంటే సర్వశుభాలు జరుగుతాయి అని భక్తులు నమ్ముతారు. తణుకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముళ్లపూడి రేణుక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వసంత నవరాత్రులు ప్రారంభం- తొమ్మిది రోజులు ఇలా చేస్తే పరిపూర్ణ అనుగ్రహం! - Vasanta Navratri 2024
తిరుపతి జిల్లా నాయుడుపేట విజయ గణపతి ఆలయం పోలేరమ్మ గుడి, సాయిబాబా, ఆంజనేయస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి పలు కార్యక్రమాలు నిర్వహించారు. దేవతా మూర్తులకు ప్రత్యేక అలంకరణ చేశారు. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
క్రోధి నామ ఉగాది సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. భక్తులు ఉదయాన్నే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఉండ్రాజవరంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి ఉగాది సందర్భంగా భక్తులు పోటెత్తారు.
కడపలో కుల మతాలకు అతీతంగా ఉగాది వేడుకలు నిర్వహిస్తారు. పండుగను పురస్కరించుకొని దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందువులతో పాటు ముస్లింలూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వెంకటేశ్వర స్వామి సతీమణి బీబీ నాంచారమ్మ ముస్లింల ఆడపడుచు కావడంతో ముస్లింలు శ్రీవారిని అల్లుడుగా భావిస్తారు.
ఈ మేరకు ప్రతి ఉగాది పండుగ రోజు ముస్లింలు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా స్వామి వారికి కావలసిన సామగ్రిని సమర్పించి ముస్లింలు ప్రత్యేక పూజలు చేశారు. కడపలోని ఈ సంస్కృతిని చూసి ఇతర ప్రాంతాల వారు ఆశ్చర్యపోతున్నారు.
కృష్ణాజిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రముఖ వేద పండితులు శేషానంద శర్మ క్రోధి నామ ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు, పలువురు టీడీపీ నేతలకు పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు.
రానున్న ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి మధ్య జరిగే యుద్ధమని దెందులూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా దుగ్గిరాలలోని తన నివాసంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం పండితులు చింతమనేనికి వేదాశీర్వచనాలు అందించారు. అటు ఏలూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ కార్యాలయంలోనూ ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు.