krishna Water War Between Andhra Pradesh And Telangana : కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాదనను ఆంధ్రప్రదేశ్ ఖండించింది. 75 శాతం విశ్వసనీయత వద్ద 555 టీఎంసీల నీళ్లు తమకు దక్కుతాయని తెలంగాణ రాష్ట్రం పేర్కొనడం అర్థ రహితమని పేర్కొంది. 65 శాతం విశ్వసనీయత వద్ద తెలంగాణ మరో 43 టీఎంసీల కేటాయింపులు కోరడానికీ ఎలాంటి ప్రాతిపదిక లేదంది. నీటి పంపకాలకు సంబంధించి ఇప్పటికే ఖరారైన అంశాలను మళ్లీ తిరగతోడేందుకు ఏ మాత్రం ఆస్కారం లేదని స్పష్టం చేసింది.
బచావత్ ట్రైబ్యునల్ ఖరారు చేసిన అంశాలను మళ్లీ తిరగతోడలేమని బ్రిజేష్ ట్రైబ్యునల్ కూడా ఇప్పటికే స్పష్టం చేసిందని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. సోమవారం కృష్ణా ట్రైబ్యునల్‌కు సమర్పించిన తన ప్రతిస్పందనలో ఈ మేరకు తెలిపింది. నీటి లభ్యత, కరవు ప్రాంత అవసరాలన్నీ పరిగణనలోకి తీసుకుని కొత్తగా కేటాయింపులు చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల జల వివాదాలు పరిశీలించాలని కేంద్రం బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు అప్పజెప్పింది.
గండికోటకు చేరిన కృష్ణా జలాలు- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు - Krishna Water Reached in Gandikota
ఇది చెల్లదంటూ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తమ తుది తీర్పునకు లోబడి బ్రిజేష్ ట్రైబ్యునల్‌లో విచారణలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది. ఆ మేరకు తెలంగాణ ఈ జలవివాదాలకు సంబంధించి బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ముందు తమ ‘స్టేట్‌మెంట్ ఆఫ్ కేసు’ సమర్పించింది. ఎన్నికల దృష్ట్యా తెలంగాణ స్టేట్‌మెంట్‌కు ఏపీ ప్రతిస్పందన నోట్ పంపడం ఆలస్యమైంది.
ట్రైబ్యునల్ గడువివ్వడంతో ఏపీ ప్రభుత్వం సోమవారం దాన్ని సమర్పించింది. దానిలో తెలంగాణ వాదనతో పూర్తిగా విభేదించింది. విభజన చట్టంలోని అంశాలను, బచావత్ ట్రైబ్యునల్, బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ గతంలో పేర్కొన్న విషయాలను, సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను ఉదహరిస్తూ తన వాదనను వినిపించింది.
ఏపీ ప్రతిస్పందన నోట్‌లో ముఖ్యాంశాలిలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం 75 శాతం విశ్వసనీయత వద్ద 555 టీఎంసీలు తమకు దక్కుతాయంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 512 టీఎంసీల్లో 290 టీఎంసీలు ఆధునికీకరణ పనుల వల్ల ఆదా అవుతాయని ఆ నీళ్లను తెలంగాణకు కేటాయించాలని వాదిస్తోంది. ఇది పూర్తిగా సత్యదూరం. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కేసీ కాలువ ఆధునికీకరణ పూర్తయింది. ఈ ఆధునికీకరణ వల్ల నీళ్లు ఆదా అవుతున్నాయన్నది వాస్తవం కాదు. మరోసారి ఆధునికీకరణ ఉండదు.
కృష్ణా నదీ జలాల వివాదం- అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను ఏ తీరాలకు చేర్చనుంది? - Krishna Water Dispute