Konaseema Coconut Prices Hike: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ మార్కెట్‌లో కొబ్బరికాయల ధర రికార్డు స్థాయికి చేరింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే వెయ్యి కొబ్బరికాయల ధర 9 వేల రూపాయల నుంచి రెట్టింపై 18 వేలకు చేరింది. దసరా, దీపావళి ముందున్నందున అప్పటికి ఈ ధర 20 వేల రూపాయలకు చేరొచ్చని రైతులు, వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
అయిదు సంవత్సరాల తరవాత కొబ్బరికి ఈ ధర వచ్చిందని పేర్కొంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలలో వివిధ కారణాల వల్ల కొబ్బరికాయల దిగుబడులు తగ్గడమే దీనికి కారణమని చెబుతున్నారు. కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల ధరలు సైతం భారీగా పెరిగాయి. కొబ్బరినూనె (Coconut Oil) కిలో 320 రూపాయలు, వర్జిన్ కోకోనట్ ఆయిల్ కిలో 500 రూపాయలు, ఎండుకొబ్బరి ధర క్వింటాలు 15 వేల 500 రూపాయలకు పెరిగాయి.
అదే విధంగా కొత్తకొబ్బరి, పచ్చికొబ్బరి కాయలు, కురిడీ కొబ్బరికాయల ధరలు కూడా ఆశాజనకంగానే ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ నుంచి హైదరాబాద్‌కు కొబ్బరికాయల రవాణాకు లారీకి కిరాయి 25 వేల రూపాయల నుంచి 35 వేల వరకూ ఉంటుంది. అంటే ఒక్కో కొబ్బరి కాయ రవాణాకు రూ.1-1.50 వరకు పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
పచ్చి కొబ్బరికాయలు తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబయి, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటితో పాటు కురిడీ కొబ్బరికాయలు దిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హరియాణా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్‌తో పాటు మరి కొన్ని రాష్ట్రాల వ్యాపారులు సైతం కొబ్బరికాయలు కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. దీనిని బట్టి కోనసీమ కొబ్బరికాయలకు ఏర్పడిన డిమాండ్ అర్థమవుతుంది.
గత అయిదేళ్లూ అనేక ఇబ్బందులు: ప్రస్తుతం ధర భారీగా పెరిగి, కొబ్బరి రైతులు సంతోషంగా ఉన్నప్పటికీ, గత అయిదేళ్లలో అనేక సార్లు ఇబ్బందులు పడ్డారు. దిగుబడులు తగ్గడంతో పాటు ధరల పతనం కోనసీమ కొబ్బరి రైతుల్ని కుంగదీసింది. అదే విధంగా ఆ సమయంలో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ కొబ్బరి నుంచి సైతం గట్టి పోటీ ఎదురయ్యేది. దీంతో పోటీని తట్టుకోలేక కోనసీమ రైతులు, వ్యాపారులు ఒకానొక సమయంలో చతికిలపడిపోయారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారి, భారీగా ధర పెరిగింది. దీంతో కోనసీమ కొబ్బరికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.