Kattedan Fire Accident Today : కాటేదాన్ పారిశ్రామిక వాడలోని బిస్కెట్ తయారీ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పాహల్ ఫుడ్స్ కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో దాదాపు 60 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా నాల్గొవ అంతస్తులో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో అగ్ని కీలలు ఎగిసి పడుతుండడం గమనించిన సిబ్బంది ఒక్కొక్కరుగా కర్మాగారం నుంచి బయటకు వచ్చేశారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక(Fire Department), డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు(Police) రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. 8 అగ్నిమాపక శకటాలతో పాటు బ్రాంటో స్కైలిఫ్ట్ వాహనంతో సహాయ చర్యలు చేపట్టారు. అగ్నికీలలు సమీపంలో ఉన్న కర్మాగారాలకు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మంటలు చెలరేగిన బిస్కెట్ కర్మాగారంలో అగ్నిమాపక ప్రమాణాలు లేనట్టు అధికారులు గుర్తించారు.
RANGAREDDY FIRE ACCIDENT : భారీగా ఎగిసిపడిన మంటల కారణంగా కర్మాగారం పరిసరాల్లో దాదాపు 5 కిలోమీటర్ల మేర దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఈ కారణంగా స్థానికులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఎదురైంది. మంటల వలన ప్రమాదం చోటు చేసుకున్న భవనం నాల్గొవ అంతస్తులోని రేకుల షెడ్డు కుప్ప కూలింది. మూడంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయి బీటలు వారింది. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని పోలీసులు కొంత మంది స్థానికులు అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దాదాపు పది గంటలు గడిచినా ఇంకా పూర్తి స్థాయిలో మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. మరో నాలుగైదు గంటల్లో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటన స్థలానికి రాజేంద్రనగర్ డీసీపి శ్రీనివాస్ చేరుకుని పరిస్థితి పర్యవేక్షించారు. అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాచారం పారిశ్రామిక వాడలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం - తప్పిన ప్రాణనష్టం
టోలిచౌకిలో భారీ అగ్ని ప్రమాదం - ఆయిల్ గోడౌన్లో చెలరేగిన మంటలు