Karimnagar Dumping Yard Issue : కరీంనగర్ నగరపాలక సంస్థ డంపింగ్ యార్డులో మంగళవారం అర్ధరాత్రి మంటలు అంటుకోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్న డంపింగ్ యార్డులో (Fire at Dump Yard)చెత్తకు మంటలు అంటుకోవడంతో ఆర్పడానికి ఎన్ని రోజులు పడుతుందో అని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇది నగరం వెలుపల ఉన్నప్పటికి జనాభా పెరగడంతో పట్టణం మధ్యలోకి రావడంతో సరికొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.
Karimnagar Dump Yard Fire Accident : అర్ధరాత్రి నుంచి మంటలు చెలరేగడంతో శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగ నెలకొంది. బైపాస్ రోడ్డులో పూర్తిగా పొగ కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏటా వేసవి కాలంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండగా అధికార యంత్రాంగం డంపింగ్ యార్డుకు ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. చెత్తలో మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది యత్నించినా పొగ మాత్రం తగ్గడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోదాడ డంపింగ్ యార్డుతో గ్రామస్థుల ఆందోళన.. పట్టించుకోని అధికారులు
కరీంనగర్‌లో 60 డివిజన్లలో 53,000లకు పైగా ఇళ్లు 2 లక్షలకు పైగా జనాభా ఉంది. ప్రతినిత్యం 185 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి జరుగుతోంది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను మానేరు నది తీరాన గల ఆటోనగర్‌కు చేరవేస్తున్నారు. బయోమైనింగ్ ద్వారా చెత్త నుంచి ఎరువులు తయారు చేయాలన్న ఉద్దేశ్యంతో దాదాపు రూ.16 కోట్లతో బయోమైనింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. స్మార్ట్‌సిటీ నిధులతో చేపట్టిన ఇది నిలిచిపోవడంతో మళ్లీ పూర్వస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"డంపింగ్ యార్డు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దట్టమైన పొగ వల్ల శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం. దానికి తోడూ భరించలేని దుర్వాసనతో నానా అవస్థలు పడుతున్నాం. అధికారులు, నేతలు వచ్చి చూస్తారు కానీ మాకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డంపింగ్ యార్డును మరో చోటుకి తరలించాలని కోరుతున్నాం." - స్థానికులు
రాత్రిపూట డంపింగ్ యార్డ్ పొగ.. ఆరోగ్యానికి సెగ
పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి : చెత్త నిల్వ కేంద్రానికి సమీపంలో ఉన్న కోతిరాంపూర్, కట్టారాంపూర్, ఆటోనగర్, పోచమ్మవాడ, అల్కపురికాలనీ, బొమ్మకల్ శివారుతో పాటు టవర్ సర్కిల్, కమాన్ వరకు పొగ (Dumping Yard Smoke Chokes) వ్యాపించి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. డంపింగ్ యార్డు విస్తీర్ణం పెద్ద మొత్తంలో ఉన్న దృష్ట్యా మొదట ఒక అగ్నిమాపక యంత్రంతో మంటలు ఆర్పివేశామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
మంటలు ఆర్పినా పొగమాత్రం ఆగడం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం భారీగా చెత్త ఉన్న దృష్ట్యా పొగ పూర్తిగా పోవడానికి ఎంత సమయం పడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నిల్వ కేంద్రం వల్ల కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
డంపింగ్ యార్డ్‌తో నానా అవస్థలు.. పొగతో ప్రమాదాలు.. దుర్వాసనతో రోగాలు..
కంపు కొడుతోన్న ఆటోనగర్ డంపింగ్ యార్డు.. ఆస్పత్రుల పాలవుతున్న ప్రజలు