Karempudi CI Warning to TDP Leader : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని కారంపూడి సీఐ చినమల్లయ్య అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘ఓయ్, పోలీసుస్టేషన్‌కు వస్తావా? రావా? కాల్చి పడేస్తా ఏమనుకుంటున్నావో ! రౌడీషీట్ తెరిచి లాకప్‌లో వేస్తా’ అని పల్నాడు జిల్లా కారంపూడి టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు రాముపై సీఐ చిన్నమల్లయ్య రెచ్చిపోయారు. ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో లాఠీ పట్టుకుని బెదిరించారు.
కారంపూడి మండలం పేటసన్నిగండ్లకు చెందిన చప్పిడి రాము మండల టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రచారంలో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. సోమవారం కారంపూడి కొత్త బస్టాండ్ వద్ద టీస్టాల్‌లో టీడీపీ నేతలు టీ తాగుతున్నారు. కారంపూడి పోలీసులు రెండుసార్లు అటువైపు రౌండ్లు వేశారు. మొదట ఎస్సై రామాంజనేయులు వచ్చి చూసి సీఐకి సమాచారమిచ్చారు. మూడోసారి ఏకంగా సీఐనే జీపు ఆపి టీస్టాల్ వద్దకొచ్చి ఎవడ్రా వీరిని ఇక్కడ కూర్చోబెట్టిందని గదమాయించారు. వాళ్లు టీ తాగుతున్నారని దుకాణ యజమాని సమాధానమిచ్చారు.
అయినా వినిపించుకోకుండా ఇక్కడినుంచి పోతారా పోరా? అంటూ టీడీపీ శ్రేణుల్లో ఒక దివ్యాంగుడిని లాఠీతో కొడుతూ సీఐ వీరంగం సృష్టించారు. 'మేమెందుకు పోవాలి సార్ టీ తాగడం కూడా తప్పేనా?’ అని టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు చప్పిడి రాము ప్రశ్నించారు. ‘మీరంతా ఇక్కడినుంచి పోతారా పోరా? నన్నే ఎదిరిస్తావా? పదరా స్టేషన్‌కు’ అంటూ సీఐ చినమల్లయ్య హుకుం జారీ చేశారు. ఎందుకు రావాలంటూ మిగిలిన టీడీపీ నేతలంతా ప్రశ్నించారు.
అనంతపురం జిల్లాలో అమానుషం - వైసీపీ జెండా కాల్చేశాడని
తననే ఎదిరిస్తారా అంటూ తుపాకీ చేతిలో పట్టుకుని వాగ్వాదానికి దిగారు. రౌడీషీట్ తెరుస్తానంటూ హెచ్చరించారు. చప్పిడి రామును తుపాకీతో జీపు ఎక్కించుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. తెలుగుదేశం నేతను అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నాయకులు పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సీఐ చినమల్లయ్య తమ వద్దకు వచ్చి కావాలనే గొడవ పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కోడ్ అమల్లో ఉండగా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం ఏమిటని మండిపడ్డారు.
పూచీకత్తు సమర్పించి చప్పిడి రాము బయటకు వచ్చాక పార్టీ శ్రేణులు శాంతించాయి. అక్రమ అరెస్టులను ప్రజలంతా గమనిస్తున్నారని మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసుకొని పోలీసు వ్యవస్థ పని చేస్తోందని, అటువంటి అధికారులకు భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతామని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. అదే విధంగా స్థానిక నాయకులతో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు. సంఘటనపై సీఐను ప్రశ్నించగా, క్రికెట్ బెట్టింగ్‌పై అనుమానంతో చప్పిడి రామును స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించి పంపించామని సీఐ చినమల్లయ్య తెలిపారు.
భార్య, కుమారుడిపై పోలీసుల దాడి- మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యాయత్నం